నేషనల్ ​హైవేస్​ పనుల్లో మున్సిపాలిటీ జోక్యం

నేషనల్ ​హైవేస్​ పనుల్లో మున్సిపాలిటీ జోక్యం
  • వర్క్స్​కంప్లీట్ ​కాకుండానే ‘బ్యూటిఫికేషన్’ పనులు
  • ఒక్కో మొక్కను  రూ.1500 పెట్టి కొనుక్కచ్చిన్రు  
  • పీకేయాల్సి వస్తుందంటున్న రోడ్​ కాంట్రాక్ట్​ ఏజెన్సీ
  • నేషనల్ ​హైవే ఈఈకి కంప్లయింట్​ చేసిన సంస్థ

ఎవరి పని వాళ్లు చేస్తే మంచిగుంటది. కానీ మహబూబ్​నగర్​లో ఒకవైపు నేషనల్ ​హైవే పనులు జరుగుతుండగానే, మొక్కలు నాటతామని మున్సిపాలిటీతో పాటు కాంట్రాక్టర్ ​జోక్యం చేసుకుంటున్నారు. నేషనల్  ​హైవే– 167 పనులు పూర్తి కాకుండానే డివైడర్ల మధ్యలో ప్లాంటేషన్ పనులు చేస్తున్నారు. దీని కోసం డివైడర్లను కూలుస్తుండడంతో రోడ్డు దెబ్బతింటోంది.  దీంతో తమకు నష్టం జరుగుతోందని కాంట్రాక్టర్​, మున్సిపాలిటీపై..రోడ్ ​కాంట్రాక్ట్​ ఏజెన్సీ నేషనల్ ​హైవేస్ ​ఈఈకి కంప్లయింట్​ చేసింది. డబ్బులు దండుకోవడానికే హడావిడిగా మొక్కలు నాటుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

మహబూబ్​నగర్​, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్​హెచ్​–167 కల్వకుర్తి నుంచి ప్రారంభమై మక్తల్​ మీదుగా కర్ణాటకలోని రాయచూర్​లో కలుస్తుంది. ఈ పనుల్లో ఒక భాగం జడ్చర్ల–-మహబూబ్​నగర్ మధ్య నడుస్తున్నాయి. ఇప్పటికే నాలుగు లైన్ల రోడ్డు దాదాపు పూర్తి కావచ్చింది. మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ పరిధిలో కూడా ఈ పనులు కంప్లీట్​ అయ్యాయి. ఇప్పుడు డివైడర్లు వేయడంతో పాటు రెయిలింగ్​ ఏర్పాటు చేస్తున్నారు. ఇదే టైంలో అత్యుత్సాహం చూపిన మున్సిపల్​ ఆఫీసర్లు బ్యూటిఫికేషన్​ కోసం హైదరాబాద్​కు చెందిన హెచ్ఎండీఏ కాంట్రాక్టర్​తో కలిసి డివైడర్ల మధ్యలో మొక్కలు నాటుతున్నారు. ఈ క్రమంలో ఎక్సవేటర్లతో గోతులు తీస్తుండడంతో చాలా చోట్ల డివైడర్లు దెబ్బతిన్నాయి. రోడ్డు డ్యామేజ్​అయ్యింది. కొన్ని చోట్ల రెయిలింగ్​ కూడా తొలగించారు.

పనులు చేయడానికి వాళ్లెవరు?

రోడ్​ కాంట్రాక్ట్​ తీసుకున్న సంస్థ హైవే పనులు ఇంకా కంప్లీట్​ చేయలేదు. ప్రస్తుతం డివైడర్ల మధ్య రెయిలింగ్​పనులు నడుస్తున్నాయి. త్వరలో వీటి మధ్య బటర్​ఫ్లై లైట్లు ఏర్పాటు చేయనున్నారు. డివైడర్ల మధ్యలో కేబుల్ ​వైర్ల కోసం తవ్వాల్సి ఉంది. ఇవన్నీ పూర్తి కాకుండానే మున్సిపాలిటీ, హెచ్​ఎండీఏ కాంట్రాక్టర్ ​ప్లాంటేషన్​ చేయడంపై సదరు సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్మిషన్​ లేకుండా మొక్కలు నాటుతున్నారని ఎన్​హెచ్​ఈఈకి ఈ నెల 22, 24 తేదీల్లో రెండు సార్లు కంప్లయింట్ ​చేసింది. మొక్కలను నాటే క్రమంలో ఎక్సవేటర్లతో డివైడర్లను డ్యామేజ్​ చేస్తున్నారని, నష్టాన్ని మున్సిపాలిటీ భరించాలని, కారణమైన ప్లాంటేషన్ ​కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇందులో డ్యామేజ్ అయిన డివైడర్లు, రోడ్ల ఫొటోలను యాడ్​ చేసింది. వీటిని ప్లాంటేషన్​కాంట్రాక్టర్​తో గాని, మున్సిపాలిటీతో గాని రిపేర్​ చేయించాలని లెటర్​లో కోరింది. ప్రస్తుతం నాటిన పెద్ద మొక్కలతో తాము చేయబోయే పనులకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. తమకు కాంట్రాక్ట్​ ఉన్నంత కాలం ఇతరులెవరూ ఈ రోడ్డుపై  పనులు చేయడానికి వీల్లేదని, ఒక వేళ పనులు అప్పగించాల్సి వస్తే తమ కాంట్రాక్ట్​ క్యాన్సిల్​చేయాలని అందులో స్పష్టం చేసింది.

ఒక్కో మొక్కకు 1500 

రోడ్డు మధ్యలో మొక్కల కోసం మున్సిపాలిటీ భారీగా ఖర్చు చేసినట్లు తెలిసింది. ఒక్కో మొక్కను రూ.1,500 వరకు పెట్టి కొన్నట్టు సమాచారం మొత్తం రెండు వేల మొక్కలు నాటాల్సి ఉండగా, రెండు విడతల్లో వెయ్యి చొప్పున నాటేందుకు ప్లాన్​ చేశారు. ఇప్పటికే వెయ్యి మొక్కలు తెప్పించి నాలుగు రోజులుగా డివైడర్ల మధ్యలో నాటుతున్నారు. అయితే, బటర్​ఫ్లై లైట్ల ఏర్పాటుకు, కేబుట్​వైర్ల కోసం రోడ్డు కాంట్రాక్ట్​ తీసుకున్న సంస్థ డివైడర్ల మధ్య తవ్వితే ఈ మొక్కలను  తొలగించే అవకాశం ఉంది. అలా జరిగితే దాదాపు లక్షల్లో ప్రజాధనం వృథా అయ్యే ఛాన్స్​ ఉంది.

పర్మిషన్​ ఇయ్యలె

మహబూబ్​నగర్​ మున్సిపాలిటీ పరిధిలోని నేషనల్​ హైవే-167 డివైడర్ల మధ్య మొక్కలు నాటేందుకు ఎవరికీ పర్మిషన్ ​ఇయ్యలె. కానీ, సంబంధం లేని వ్యక్తులు ఎక్సవేటర్లతో గోతులు తీశారు. పెద్ద మొక్కలను నాటారు. ఆ టైంలో డివైడర్లు దెబ్బతిన్నాయ్. డివైడర్ల మధ్య బటర్​ఫ్లై లైట్లు పెట్టాలనే ప్రోగ్రాం రోడ్​కాంట్రాక్ట్​లో ఉంది. ఇప్పుడు ఆ పనులు చేయాల్సి ఉంది. అవసరమైతే ఇప్పుడు నాటిన మొక్కలను పీకేయాల్సిన పరిస్థితి రావచ్చు. 

- ప్రతాప్​రెడ్డి, ఎన్​హెచ్​ఈఈ

ఆపమంటే ఆపేస్తాం

ప్లాంటేషన్​ పనులు ఆపమంటే ఆపేస్తాం. మాపై ప్రెషర్​ ఉండడం వల్లే మొక్కలు నాటే పనులు స్పీడ్​గా చేస్తున్నాం. డివైడర్లు దెబ్బతింటే అది మున్సిపాలిటీ బాధ్యతే నాకు సంబంధం లేదు 

- నరేందర్, హెచ్ఎండీఏ కాంట్రాక్టర్