IPL 2024: ఏమైంది మనోళ్ళకు: ఘోరంగా విఫలమవుతున్న టీమిండియా వరల్డ్ కప్ జట్టు

IPL 2024: ఏమైంది మనోళ్ళకు: ఘోరంగా విఫలమవుతున్న టీమిండియా వరల్డ్ కప్ జట్టు

జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం(ఏప్రిల్ 30) జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన పటిష్ఠమైన జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టును ప్రకటించగానే ఈ సారి వరల్డ్ కప్ పై ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. అయితే మన వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు పేలవ ఫామ్ లో ఉన్నారు.

అప్పటివరకు అదరగొట్టిన మన ఆటగాళ్లు సడన్ గా ఫెయిల్ అవుతున్నారు. వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించిన తర్వాత వరల్డ్ కప్ స్క్వాడ్ లోని అరడజనుకు పైగా ప్లేయర్స్ ఘోరంగా విఫలమయ్యారు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 4 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదే మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 10 పరుగులు చేసి నిరాశ పరిస్తే.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య డకౌటయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్స్  శివమ్ దూబే, రవీంద్ర జడేజా వరల్డ్ కప్ జట్టులో ఉన్నారు. 

ఈ సీజన్ లో టాప్ ఫామ్ లో ఉన్న దూబే తొలి బంతికే డకౌటయ్యాడు. జడేజా కేవలం నాలుగు బంతుల్లో 2 పరుగులే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఇదే మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 52 పరుగులు సమర్పించుకున్నాడు. నిన్న (మే 2) సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ వికెట్ తీసుకోక పోగా నాలుగు ఓవర్లలో ఏకంగా 62 పరుగులు సమర్పించుకున్నాడు. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ డకౌటయ్యాడు. 

టీమిండియాకు ఎంపికైన ఆటగాళ్లందరూ ఒక్కసారిగా విఫలమయ్యేసరికి ఫ్యాన్స్ ను ఆందోళనకు గురి చేస్తుంది. అసలే పదేళ్లుగా మనకు ఐసీసీ టోర్నీ లేదు. ఈ నేపథ్యంలో ఇలా ఆటగాళ్లు విఫలం కావడం కొత్త టెన్షన్ కు గురి చేస్తుంది. ఐపీఎల్ లో ఇంకా 4 లేదా 5 మ్యాచ్ లు ఉన్నాయి కాబట్టి త్వరగా వరల్డ్ కప్ జట్టు ఆటగాళ్లు ఫామ్ లోకి రావడానికి ఇదొక చక్కని అవకాశం.