భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన భారత్-యుఎస్ వాణిజ్య ఒప్పందం...

 భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన భారత్-యుఎస్ వాణిజ్య ఒప్పందం...

భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చింది. దింతో  ఈరోజు మంగళవారం (ఫిబ్రవరి 3) స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో ముగిశాయి.  ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత, సెన్సెక్స్ 4,205.27 పాయింట్లు (5.14) శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ట స్థాయి 85,871.73 కు చేరుకుంది. తరువాత  2,072.67 పాయింట్లు ( 2.54 శాతం) పెరిగి 83,739.13 వద్ద ముగిసింది. నిఫ్టీ 639.15 పాయింట్లు (2.55 శాతం) పెరిగి 25,727.55 వద్ద ముగిసింది.  

భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలను 18 శాతానికి తగ్గించడం, వాణిజ్య ఒప్పందానికి అంగీకరించడం స్టాక్ మార్కెట్‌పై మంచి  ప్రభావం చూపింది. దింతో సెన్సెక్స్, నిఫ్టీ  కూడా రెండు శాతానికి పైగా లాభాలను నమోదు చేశాయి.  

మంగళవారం నాడు భారత రూపాయి విలువ 122 పైసలు (1.33 శాతం) పెరిగి US డాలర్‌తో పోలిస్తే 90.27 (తాత్కాలిక) వద్ద ముగిసింది అలాగే ఆసియా కరెన్సీలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కరెన్సీగా అవతరించింది.

Also Read : 20 నిమిషాల్లో 20 లక్షల కోట్లు సంపద సృష్టి

సోమవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.., భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందని, దింతో వాషింగ్టన్ భారత వస్తువులపై పరస్పర సుంకాలను ప్రస్తుత 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అన్నారు.

సెన్సెక్స్‌లోని 30 కంపెనీలలో అదానీ పోర్ట్స్ 9.12 శాతం పెరిగి అత్యధికంగా లాభపడింది. బజాజ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్రా, భారత్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.  

ఈరోజు ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి ఇండెక్స్  దాదాపు 7 శాతం పెరిగింది. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్, షాంఘై SSE కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ ఇండెక్స్ కూడా లాభాలతో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి.