ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు: వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్

ట్రేడ్ డీల్పై రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు: వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్

అమెరికాతో వాణిజ్య ఒప్పందం చారిత్రకం అన్నారు కేంద్ర వాణిజ్య మంత్రి  పీయూష్​ గోయల్. ఈ డీల్ భారత్ కు లాభమేనని.. భారత్ భవిష్యత్ ను మారుస్తుందని అన్నారు. మంగళవారం (ఫిబ్రవరి 03) ట్రేడ్ డీల్ పై విపక్షాల విమర్శలు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ నిర్వహించిన మంత్రి.. ట్రేడ్ డీల్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. 

యూఎస్ తో ఏర్పాటు చేసుకున్న ట్రేడ్ డీల్ తో భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుందన్నారు గోయల్. రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై రాహుల్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని.. అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోక్ సభలో విపక్షాలు దురుసుగా ప్రవర్తించాయని చెప్పారు. 

అమెరికాతో సోమవారం రాత్రి వాణిజ్య ఒప్పందం కుదిరిందని చెప్పిన మంత్రి.. ఈ ఒప్పందం కారణంగా రైతులు, డెయిరీ, వ్యవసాయ అనుబంధ రంగాలు లాభపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. డీల్ పై అన్ని వర్గాలు సంతోషం ప్రకటిస్తున్నాయని చెప్పారు. 

ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత భారత వస్తువులపై టారిఫ్ లను 25 శాతం నుండి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీని వలన యూఎస్–ఇండియా సంబంధాలు పబపడతాయి. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఇప్పుడు తక్కువ టాక్స్ లతో ఎగుమతి చేయడానికి వీలుంటుంది. ప్రధాని మోదీ రిక్వెస్ట్ ను గౌరవించి తీసుకున్న ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. గతంలో విభేదాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా వ్యవసాయంపై చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న భారతదేశం-యుఎస్ వాణిజ్య ఒప్పందం ఇప్పుడు ఆల్మోస్ట్ డీల్ కుదిరిందని ట్రంప్ అన్నారు. రష్యన్ చమురు కొనుగోళ్లను తగ్గించి, దిగుమతులను అమెరికా, వెనిజులా నుంచి చేసుకోవడానికి  ప్రధాని అంగీకరించారని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పినట్లు పీయూష్​ గోయల్ తెలిపారు. 

సాధారణంగా, మేము ఈ విషయం గురించి పార్లమెంట్‌లో మాట్లాడాలనుకున్నాము, కానీ విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందున ప్రెస్ మీట్ నిర్వహించాల్సి వచ్చింది. ఈ రోజు పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ,  వారి మిత్రపక్షాలైన డీఎంకే, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీలు చాలా అవమానకరంగా ప్రవర్తించాయి. వారు స్పీకర్ కుర్చీ వద్దకు కూడా వెళ్లి ఆయన్ను అవమానించారు. ప్రతిపక్షాలను, రాహుల్ గాంధీ ప్రవర్తిస్తున్న తీరును నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వారి వల్లే ఈ రోజు పార్లమెంట్‌లో మాట్లాడటానికి బదులు మీడియా సమావేశంలో చెప్పాల్సి వచ్చిందని ఈ సందర్భంగా మంత్రి పీయూష్​ గోయల్ తెలిపారు.