టెంపోను ఢీ కొట్టిన ట్రక్ 13 మంది స్పాట్ డెడ్.. మహారాష్ట్రలోని పాల్ఘర్లో దారుణం

టెంపోను ఢీ కొట్టిన ట్రక్ 13 మంది స్పాట్ డెడ్.. మహారాష్ట్రలోని పాల్ఘర్లో దారుణం
  •     నిశ్చితార్థానికి వెళుతుండగా ప్రమాదం
  •     20 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి సీరియస్
  •     టెంపోను డ్రైవర్ రాంగ్ రూట్​లో తీసుకెళ్లడమే కారణం
  •     దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన ప్రెసిడెంట్ ముర్ము, ప్రధాని
  •     5 లక్షల పరిహారం ప్రకటించిన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. నిశ్చితార్థ వేడుకకు వెళ్తున్న పెళ్లి బృందం వాహనాన్ని (టెంపో) వేైగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ భీకర ప్రమాదంలో ఇప్పటివరకు కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
 

హైవేపై రాంగ్ రూట్​లో ప్రయాణించడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు పోలీసులు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం.. దహను తాలూకాలోని బాపుగావ్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ఐషర్ టెంపో వాహనంలో ధానివరీ గ్రామంలో జరగబోయే బలరామ్ దండేకర్ నిశ్చితార్థ వేడుకకు బయలుదేరారు. ముంబై– అహ్మదాబాద్ హైవేపై యూటర్న్ తీసుకోవడానికి బదులుగా టెంపోను డ్రైవర్ రాంగ్ రూట్ లో తీసుకెళ్లాడు. అదే సమయంలో ముంబై వైపు వేగంగా వెళ్తున్న కంటైనర్ ట్రక్.. ధానివరీ గ్రామ సమీపంలో ఈ టెంపోను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఒక మోటార్ సైకిల్ కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుంది. కాగా, ఈ ప్రమాదంపై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

గాయపడ్డవారి పరిస్థితి విషమం

ప్రమాద తీవ్రతకు టెంపో ముందు భాగం నుజ్జునుజ్జయింది. కంటైనర్ కింద, టెంపో క్యాబిన్ లోపల చాలామంది ఇరుక్కుపోయారు. స్థానికులు, హైవే పోలీసులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. నలిగిపోయిన వాహనాల నుంచి క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు.

వారిలో పలువురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ప్రాథమిక విచారణ ప్రకారం.. కంటైనర్ డ్రైవర్ యొక్క మితిమీరిన వేగంతో పాటు, పెళ్లి బృందం వాహనం రాంగ్ రూట్‌లో రావడం కూడా ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని పోలీసులు భావిస్తున్నారు. ఆ టెంపోలో సామర్థ్యానికి మించి (40 మందికి పైగా) ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.