శివుడికి ఎంతో ప్రీతి.. మోదుగ పూలు

శివుడికి ఎంతో ప్రీతి.. మోదుగ పూలు

శివుడికి ఎంతో ప్రీతి మోదుగ పూలు శివుడికి ఎంతో ఇష్టమైనవి. అందుకే శివరాత్రి రోజున ఈ పూలను పరమశివుడికి సమర్పిస్తా రు. మోదుగ పూలనే కాదు కొమ్మలను కూడా పూజల్లో ఉపయోగిస్తా రు. హోమాల్లో ఎండిన మోదుగ కొమ్మలను కాలుస్తా రు. ఇలా కాల్చడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తారు.

మోదుగ పూలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎక్కువగా పూస్తాయి. ఈ పూలు కొన్ని మైదాన ప్రాంతాల్లో చెట్టు కూడా కనిపించనంతగా విరగబూస్తాయి. వీటి అందాలను ఎంత చూసినా తనివితీరదు. అందుకే ఈ చెట్టును ‘ఫ్లేమ్‌ ఆఫ్‌ ఫారెస్టు’ అని పిలుస్తారు. ఈ పూలను కొన్ని ప్రాంతాల్లో ‘గోగుపూలు’ అని కూడా పిలుస్తుంటారు. ఈ చెట్లు పొలంగట్లపై, రోడ్ల పక్కన పెరుగుతాయి. మండు వేసవిలో కూడా ఎర్రని కాంతితో ప్రకృతి ప్రేమికులను ఆకట్టు కుంటాయి. మోదుగపూలు శివుడికి ఎంతో ఇష్టమైనవని చెప్తుంటారు పెద్దలు. వీటిని ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు.

హోలీ సందర్భంగా చల్లుకునే రంగులను కూడా ఈ పూలతోనే తయారు చేస్తారు. అంతేనా.. కవులు ఈ పూలను అభ్యుదయ సూచికలుగా వర్ణించారు. అందుకే చాలామంది కవితల్లో వీటి ప్రస్తావన ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే అనేక కావ్యాల్లో మోదుగ పూల గురించి చెప్పారు కవులు. దాశరథి రంగాచార్యులు రాసిన ఒక నవలకు ‘మోదుగు పూలు’ అనే పేరు కూడా పెట్టారు. మోదుగ వేర్ల నుంచి నార వస్తుంది. దాంతో తాళ్లు తయారుచేస్తారు. ఈ మోదుగ చెట్ల నుంచి లక్క కూడా వస్తుంది. ఆదిలాబాద్‌ లో ఈ చెట్లు ఎక్కువగా ఉండడంతో లక్క సేకరిస్తున్నారు.