నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి ప్రమాదం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యానికి ప్రమాదం :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్​
  •     బీజేపీ చర్యను ఖండించిన కాంగ్రెస్​ నేతలు

హైదరాబాద్, వెలుగు: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌ రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శించారు. బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడారు. బీజేపీ రాజకీయ కుట్రల పరాకాష్టకు ఈ ఘటన నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేసి, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మలచుకోవడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తున్నదని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థలా కాకుండా బీజేపీ అనుబంధ సంస్థలా వ్యవహరిస్తున్నదనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. 

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమాలకు సిద్ధంగా ఉందన్నారు. రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వమే, వాటిని అవహేళన చేయడం దారుణమని మహేశ్​గౌడ్​విమర్శించారు. 

మీనాక్షిపై ఈసీ నిర్ణయాన్ని బీఆర్ఎస్ సమర్థిస్తుందా?: ఎంపీ చామల 

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించిన ఎన్నికల సంఘం నిర్ణయాన్ని బీఆర్ఎస్ సమర్థిస్తుందా? వ్యతిరేకిస్తుందా? అనేది స్పష్టం చేయాలని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ కేసును అడ్డంపెట్టుకుని మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించడం బీజేపీ కుట్ర రాజకీయాలకు నిదర్శనమని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీకి రెండు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు ఒక రాజ్యసభ సీటు వచ్చే అవకాశం స్పష్టంగా ఉందని, అయినప్పటికీ మూడో సీటుకు బీజేపీ అభ్యర్థిని బరిలో నిలపడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పారు.

ఇప్పటిదాకా ఓట్​చోరీ.. ఇప్పుడు సీట్​చోరీ: విప్ వేముల వీరేశం

బీజేపీ ఇప్పటివరకు ఓటు చోరీకే పాల్పడిందని, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌‌‌‌‌‌‌ తిరస్కరించడం ద్వారా సీటు చోరీకి కూడా పాల్పడినట్లయిందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఆరోపించారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.  మీనాక్షి నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించడం ద్వారా బీజేపీ ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును యూపీఏ అడ్డుకుందని విమర్శలు చేసే బీజేపీ, ఇప్పుడు ఒక మహిళా అభ్యర్థి నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించడం ద్వారా రాజకీయాల్లో మహిళలను ఎలా అణగదొక్కుతుందో స్పష్టమైందన్నారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ ద్వారా  బీజేపీ అసలు నైజం బట్టబయలైందన్నారు.

బీజేపీ మహిళా ద్రోహి: మంత్రి సీతక్క

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించి, ఆమెను రాజ్యసభకు వెళ్లకుండా బీజేపీ అడ్డుకున్నదని మంత్రి సీతక్క ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మాట్లాడుతూ, మీనాక్షి నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరించడం ద్వారా బీజేపీ మహిళా ద్రోహిగా నిలిచిందని విమర్శించారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. మహిళలను రాజకీయంగా అణగదొక్కడం ఆ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు.