హైదరాబాద్, వెలుగు: గ్యాస్, పెట్రో ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ హైదరాబాద్ లో నిరసన చేపట్టింది. మంగళవారం గాంధీ భవన్ నుంచి గన్ ఫౌండ్రీ వరకు ర్యాలీ నిర్వహించింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు.. గ్యాస్ సిలిండర్ల బొమ్మలు ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రధాని మోదీకి, బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ..కార్పొరేట్ సంస్థల లాభాల కోసం ప్రజల రక్తాన్ని పిండుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే విడతల వారీగా4 సార్లు గ్యాస్, పెట్రో ధరలను పెంచారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఒకమాట, ఆ తర్వాత మరోమాట మాట్లాడడం కేంద్ర ప్రభుత్వం రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని స్వర్ణ పేర్కొన్నారు.
