- సెర్ప్ ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు స్వయం ఉపాధి
- బైరీ సన్స్ ఆగ్రోస్ సంస్థ ద్వారా ఎస్‌హెచ్‌జీ స్టోర్స్
- షాపులు పెట్టుకునేందుకు ఒక్కో గ్రూపునకు రూ.లక్ష లోన్
- పైలట్ ప్రాజెక్టు కింద నల్గొండ, జనగామ జిల్లాల్లో నేడు ఓపెన్
నల్గొండ, వెలుగు: మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) బృహత్తర కార్యక్రమానికి శ్రీ కారం చుట్టింది. పల్లె ప్రజలకు నిత్యావసరాలు తక్కువ రేట్లకు అందించేలా ‘బైరీసన్స్ ఆగ్రో ఇండియా’ అనే సంస్థతో డీల్ కుదుర్చుకుంది. ఈ సంస్థను నోడల్ ఏజెన్సీగా పెట్టుకొని అన్ని గ్రామాల్లో ‘తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్స్’ పేరుతో కిరాణా స్టోర్స్ ఓపెన్ చేయనుంది. ఇందుకోసం సెర్ప్ఆఫీసర్లు పైలెట్ ప్రాజెక్టులుగా నల్గొండ, జనగామ జిల్లాలను ఎంపిక చేశారు. ఆగస్టు నాటికి అన్ని గ్రామాల్లో స్టోర్స్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే నల్గొండ జిల్లాలోని అన్ని గ్రామాల్లో మ హిళలకు అవగాహన కల్పించారు. ఆసక్తి చూపుతున్న మహిళల నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికైతే నల్గొండ జిల్లాలోని 10 మండలాల్లో 60 స్టోర్స్ ఏర్పాటుకు సెల్ఫ్ హెల్ప్గ్రూప్ మహిళలు ముందుకొచ్చారు.
15% డిస్కౌంట్
ఈ స్టోర్స్ లో ఉప్పు నుంచి పప్పు దాకా అన్నిరకాల కిరాణా సామగ్రి అందుబాటులో ఉంచుతారు. మహిళలు సొంతంగా తయారు చేసే రకరకాల ప్రొడక్ట్స్‌కు మార్కెటింగ్కల్పిస్తారు. మహిళలు తయారు చేసిన వస్తువుల క్వాలిటీని ముందుగా బైరీ సన్స్ సంస్థ చెక్ చేస్తుంది. ఏమైనా తేడాలు కనిపిస్తే మహిళలకు మెరుగైన శిక్షణ ఇస్తారు. ఆశించిన క్వాలిటీ వచ్చాకే వాటిని స్టోర్స్‌లో అమ్మకానికి పెడ్తారు. వీటితో పాటు బైరీసన్స్ సంస్థ తయారు చేసిన అన్ని రకాల ప్రొడక్ట్స్‌ను స్టోర్స్‌లో అందుబాటులో ఉంచుతారు. మార్కెట్లో కంటే తక్కువ ధరలకే సరుకులు దొరికేలా చూస్తారు. 15 % దాకా డిస్కౌంట్ దొరుకుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఎస్‌హెచ్‌జీ మిత్రలతో కస్టమర్ సర్వీస్
తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ అందిస్తున్న సేవలు, సరుకుల గురించి గ్రామాల్లో ప్రజలకు వివరించేందుకు ప్రతి గ్రామానికి ఎస్‌హెచ్‌జీ మిత్రలను నియమించారు. వీళ్లకు నెలకు రూ.5 నుంచి రూ.6వేల దాక వేతనం చెల్లిస్తారు. వీళ్లు స్టోర్స్‌లో ఎలాంటి వస్తువులు? ఏ రేటుకు దొరుకుతాయి? అనే విషయాన్ని ప్రజలకు తెలిసేలా ఇంటింటా తిరిగి ప్రచారం చేస్తారు. స్టోర్స్‌కు వచ్చే కస్టమర్ల సెల్ నంబర్లు సేకరించి ‘బి-మార్ట్’ యాప్‌తో లింక్ చేస్తా రు. సరుకులు ఆర్డర్ చేసేందుకు సపరేట్గా కోడ్ నంబరు ఒకటి కస్టమర్లకు ఇస్తారు. ‘బి-మార్ట్’ యాప్‌లో సరుకులు ఆర్డర్ చేస్తే సరిపోతుంది. డోర్ డెలవరీ కూడా చేస్తారు.
ఆన్లైన్లో ఆర్డర్ పెడితే చాలు
గ్రామాల్లో ఈ స్టోర్స్ ఏర్పాటు చేసుకోవడానికి ఏదైనా మహిళా సంఘం కనీసం లక్ష రూపాయల పెట్టుబడి పెడితే సరిపోతుంది. బైరీసన్స్ పేరుమీద మహిళలు రూ.లక్ష డీడీ చెల్లించాలి. ఇందులో రూ.50 వేలకు సరుకులు, మరో రూ.50 వేల వరకు స్టోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పంపిస్తారు. ఆ తర్వాత బిజినెస్ టర్నోవర్బట్టి బైరీసన్స్ నుంచి సరుకులు పంపిణీ చేస్తారు. సంస్థే నేరుగా స్టోర్స్‌కు సరుకులు సప్లై చేస్తుంది. మహిళలపై ఎలాంటి ట్రాన్స్పోర్ట్భారం ఉండదు. సరుకుల నిల్వలను బట్టి ఆన్లైన్లో ఆర్డర్ పెడితే సరిపోతుంది. ప్రత్యేకంగా ‘బి-మార్ట్’ అనే యాప్ కూడా క్రియేట్ చేశారు.
నాంపల్లి మండలంలో 31 స్టోర్స్
తెలంగాణ ఎస్‌హెచ్‌సీ స్టోర్స్ కంటే ముందు బైరీసన్స్ పేరుమీదనే బోర్డులు పెట్టారు. కానీ సెర్ప్ ఆదేశాల మేరకు తెలంగాణ ఎస్‌హెచ్‌జీ స్టోర్స్ అని మార్చా రు. నల్గొండ జిల్లాలోని ఒక్క నాంపల్లి మండలంలోనే 31 స్టోర్స్ శనివారం ఓపెన్ చేయనున్నారు. దీనికి సంబంధించి డీఆర్డీఓ వై.శేఖర్‌రెడ్డి శుక్రవారం
బ్రోచర్ ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆగస్టు నాటికి 500 స్టోర్స్ ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన చెప్పారు. జూన్ ఫస్ట్ వరకు 61 స్టో ర్స్ ఓపెన్ చేస్తామని వివరించారు.
