బీఆర్ఎస్ నేతల తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. హరీష్ రావు పచ్చి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజలను పక్కదోవ పట్టించడం తప్ప బీఆర్ఎస్ నేతలకు మరో ఆలోచన లేదని మండిపడ్డారు.
పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత గులాబీ పార్టీదేనన్న ఆది శ్రీనివాస్.. కోడిగుడ్డు మీద ఈకలు పీకే రకం అంటూఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోవాలని కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు ఎవరూ అనుకోవడం లేదని.. కేవలం బీఆర్ఎస్ నేతలు మాత్రమే సొంత డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు.
ముఖ్యంగా క్రాస్ ఓటింగ్, పార్టీ ఫిరాయింపులపై ఆది శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన వారు మీకు మంచోళ్లు అయ్యారా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు పితామహుడు కేసీఆర్ అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ నేతలు వాడుతున్న క్రాస్ బ్రీడ్, హైబ్రీడ్ వంటి పదజాలం వారికే వర్తిస్తాయని.. అధికారం కోసం, ప్రజలను దోచుకోవడం కోసమే వారి ఆరాటమంతా అని ఆది శ్రీనివాస్ విమర్శించారు. ప్రతి మాటలోనూ అబద్ధాలు ఆడుతూ బీఆర్ఎస్ పార్టీ దిగజారి మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

