పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లో ఉన్న మెట్రోపాలిస్ హోటల్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మూడో అంతస్తులో ఉన్న వంటగదిలో అకస్మాత్తుగా మొదలైన మంటలు.. పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వ్యాపించడంతో డైనింగ్ హాల్ పూర్తిగా బూడిదైంది. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో బస చేస్తున్న 67 మంది ప్రాణభయంతో అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, మంటలు మిగిలిన అంతస్తులకు వ్యాపించకుండా అడ్డుకున్నారు.
అత్యాధునిక హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్ వెహికల్ ‘బ్రాంటో స్కైలిఫ్ట్’ సహాయంతో హోటల్లో చిక్కుకున్న 67 మందిని సురక్షితంగా కిందికి దించి కాపాడారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.
