యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం

యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా దామరచర్లలో నిర్మాణంలో ఉన్న ప్రతిష్టాత్మక యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ ప్లాంట్​లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. యూనిట్–-3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కార్మికులు, ఇంజినీర్లు భయాందోళనకు గురయ్యారు. పంప్ వద్ద ఉన్న లూబ్రికేషన్ ఆయిల్ లీకవడం వల్లే మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద తీవ్రతకు కంట్రోల్ కేబుల్స్, కొన్ని కీలకమైన వాల్వ్‌‌ లు పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం.

అయితే, అక్కడే ఉన్న ఫైర్​ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేయడంతో మెయిన్ టర్బైన్లు, బాయిలర్ల వంటి ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న జెన్‌‌కో  ఉన్నతాధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.  ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? ఎంతమేర ఆస్తి నష్టం వాటిల్లింది? అనే వివరాలు సేకరిస్తున్నారు. అధికారులు ప్లాంట్ పరిసరాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.