రేపు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ పగ్గాలు

రేపు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్ పగ్గాలు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేపు మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టనున్నారు.రేపు( బుధవారం) ఉదయం ఖర్గే పార్టీ పగ్గాలు అందుకోనున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొంటారు. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీఎల్పీ నాయకులు, కాంగ్రెస్ పాలిత రాష్ట్ర మంత్రులు ఇతరులు పాల్గొంటారు. ఇప్పటికే వారికి ఆహ్వానాలు పంపారు. 24 ఏండ్ల తర్వాత ప్రెసిడెంట్ అయిన గాంధీ కుటుంబేతర వ్యక్తిగా ఖర్గే నిలిచారు.

కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి సీనియర్ నేతలు ఖర్గే, థరూర్ పోటీ పడగా ఈ నెల 17న ఓటింగ్ జరిగింది. మొత్తం 9,385 మంది పార్టీ డెలిగేట్లు ఓటు వేశారు. ఖర్గేకు7,897 ఓట్లురాగా, థరూర్​కు1,072 ఓట్లు వచ్చాయని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.

అధ్యక్ష పదవి దాకా అంచెలంచెలుగా.. 

  • విద్యార్థి నాయకుడిగా, కార్మిక యూనియన్ లీడర్​గా మొదలైన మల్లికార్జున ఖర్గే (80) ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దాకా అంచెలంచెలుగా సాగింది.
  • కర్నాటకలోని బీదర్ జిల్లా వరవట్టి గ్రామంలో 1942 జులై 21న దళిత నిరుపేద కుటుంబంలో ఖర్గే జన్మించారు.
  • బీఏ, లా  చదివిన ఖర్గే కొంతకాలం లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. విద్యార్థి దశ నుంచే లీడర్​గా పేరు తెచ్చుకున్నారు.
  • 1969లో కాంగ్రెస్‌‌లో చేరిన ఆయన తొలిసారిగా1972లో గుర్మిట్కల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆపై వరుసగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
  • 1976లో తొలిసారి మంత్రి అయ్యారు.  

  • 2005 నుంచి 2008 వరకు కర్నాటక పీసీసీ చీఫ్​గా బాధ్యతలు చేపట్టారు.
  • మూడు సార్లు సీఎం అయ్యే చాన్స్ మిస్ అయినా గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగానే కొనసాగారు.
  • 2009లో గుల్బర్గా నుంచి ఎంపీగా గెలిచారు. మన్మోహన్ కేబినెట్ లో కేంద్రంలో కార్మిక శాఖ, రైల్వే శాఖ, న్యాయ శాఖల మంత్రిగా బాధ్యతలు  నిర్వర్తించారు.
  • 2014లో లోక్ సభలో ప్రతిపక్ష నేతగా నియమితులయ్యారు.
  • ఓటమి ఎరుగని నాయకుడిగా పేరున్న ఖర్గే 2019లో తొలిసారిగా (గుల్బర్గా ఎంపీ సీటులో) ఓడిపోయారు.
  • 2021 ఫిబ్రవరిలో ఆయనను కాంగ్రెస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. అప్పటి నుంచి ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.