- బాలిక కిడ్నాప్ కేసులో పట్టుకువచ్చిన పోలీసులు
- సిబ్బంది కళ్లు గప్పి వెనుక డోర్ నుంచి పరార్
తాండూరు, వెలుగు: బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు సంకెళ్లతో సహా పోలీస్స్టేషన్నుంచి తప్పించుకోవడం కలకలం రేపుతోంది. గత నాలుగు రోజులుగా ఈ విషయాన్ని తాండూరు పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. యూపీకి చెందిన ఆసిఫ్ అలియాస్ అజీమ్ (28) వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ హెయిర్ సెలూన్లో పనిచేస్తున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న17 ఏండ్ల బాలికకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఇంటి నుంచి తీసుకెళ్లాడు.
ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు చేయడంతో తాండూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత శనివారం హైదరాబాద్లో నిందితుడిని అదుపులోకి తీసుకొని, రిమాండ్ ప్రక్రియ కోసం తాండూరుకు తరలించారు. అయితే, సోమవారం మధ్యాహ్నం రిమాండ్ ప్రక్రియ కొనసాగుతుండగా.. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ, గార్డ్ ఇన్చార్జ్, మహిళా కానిస్టేబుల్ల కళ్లుగప్పి నిందితుడు స్టేషన్ వెనుక తలుపు నుంచి సంకెళ్లతో సహా పరారయ్యాడు.
పది రోజుల కింద ఓ చైన్ స్నాచర్ తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఇప్పుడు కిడ్నాపర్ పారిపోవడం పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. విధుల్లో అశ్రద్ధ వహించిన బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
