తండ్రిని భుజాలపైనే మోస్తూ.. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన కొడుకు

తండ్రిని భుజాలపైనే మోస్తూ.. ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన కొడుకు
  • లాక్​డౌన్​తో ఆటోను మధ్యలోనే ఆపేసిన పోలీసులు
  • వేరే మార్గంలేక భుజాలపై తండ్రిని మోసుకెళ్లిన కొడుకు
  • కేరళలోని పునలూర్​లో ఘటన

కొల్లాం: అనారోగ్యంతో ఉన్న తండ్రిని హాస్పిటల్​ నుంచి ఇంటికి తీసుకెళుతుండగా పోలీసులు ఆటోను ఆపేయడంతో ఓ వ్యక్తి భుజాలపైనే తండ్రిని మోసుకుంటూ వెళ్లాడు. తండ్రి బరువును మోయలేక ఇబ్బందులు పడుతూనే మండుటెండ, ట్రాఫిక్​జామ్​లో ఒక కిలోమీటర్​ దూరం నడిచి తీసుకెళ్లాడు. అతని వెనకే ఓ మహిళ హాస్పిటల్​ డాక్యుమెంట్స్​, ప్రిస్క్రిప్షన్​, ఇతర వస్తువులు పట్టుకుని పరుగెత్తింది. కేరళ కొల్లాం జిల్లా పునలూర్​లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​ కావడంతో కేరళ రాష్ట్ర హ్యూమన్​ రైట్స్​ కమిషన్​ సుమోటోగా కేసు నమోదు చేసింది.

లాక్​డౌన్​ కారణంగా..
పునలూర్​లోని కులతుపుజకు చెందిన 65 ఏండ్ల వ్యక్తిని పునలూర్​ తాలూకా హాస్పిటల్​ నుంచి డిశ్చార్జ్​ చేశారు. తండ్రిని ఇంటికి తీసుకెళ్లేందుకు అతని కొడుకు ఆస్పత్రికి ఒక ఆటోను తీసుకెళ్లాడు. వారు ఇంటికి బయలుదేరగా మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు. లాక్​డౌన్​ గైడ్​లైన్స్​కు వ్యతిరేకంగా ఆటో నడపరాదని చెప్పారు. తండ్రి ఆస్పత్రి డాక్యుమెంట్లు చూపించినా ఆటోను పోలీసులు వదల్లేదు. తమ ఇంటికి కిలోమీటర్​ దూరం ఉందనగా పోలీసులు ఆపేయడంతో వేరే గత్యంతరం లేక అతడు షర్ట్​ కూడా వేసుకోకుండా ఉన్న తండ్రిని భుజాలపై మోసుకుంటూ ట్రాఫిక్​ జామ్​లో నడుచుకుంటూ వెళ్లాడు. హాస్పిటల్​ డాక్యుమెంట్లను చూపినా పోలీసులు తమ ఆటోను అనుమతించలేదని అతడు ఆరోపించాడు. ఆటోను ఆపినప్పుడు అందులో పేషెంట్​ లేడని, ఆటోను ఆపిన తర్వాతే అతడు వెహికల్​ దిగి 200 మీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్​కు వెళ్లి.. వచ్చేటప్పుడు తన తండ్రిని భుజాలపై తీసుకుని వచ్చాడని పోలీసులు చెప్పారు. కాగా, తండ్రిని భుజాలపై మోసుకుని వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయ్యింది. దీంతో ఈ ఘటనపై కేరళ రాష్ట్ర హ్యూమన్​ రైట్స్​ కమిషన్​ సుమోటోగా కేసు నమోదు చేసింది.