డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు సీరియస్: ఇక పై బ్యాంకులదే పూర్తి బాధ్యత !

డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు సీరియస్: ఇక పై బ్యాంకులదే పూర్తి బాధ్యత !

దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలను సుప్రీంకోర్టు కేవలం నేరంగా మాత్రమే కాకుండా, ప్రజల సొమ్మును దోపిడీ చేయడంగా  వర్ణించింది. ఈ విషయంలో బాధితులను నిందించడం ఆపి, వ్యవస్థలోని లోపాలను సరిచేయాలనీ కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పును విద్యారంగ నిపుణులు, పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి.

ఇప్పటి వరకు డిజిటల్ మోసం జరిగితే అది బాధితుడి పొరపాటు అనుకునేవారు. కానీ, ఇకపై ఆ బాధ్యత బ్యాంకులే తీసుకోవాలని కోర్టు పేర్కొంది. భారీ మొత్తంలో అనుమానాస్పద లావాదేవీలు జరిగినప్పుడు బ్యాంకులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నాయని ప్రశ్నించింది.

 ఇందుకు ఉదాహరణ ఇస్తూ ఎప్పుడూ 10 వేలు మాత్రమే వాడే ఒక సామాన్యుడు లేదా రిటైర్డ్ ఉద్యోగి అకస్మాత్తుగా 50 లక్షలు బదిలీ చేస్తుంటే, బ్యాంకులు వెంటనే స్పందించి ఆ లావాదేవీని ఆపాలి. అలా చేయకపోవడం బ్యాంకుల వైఫల్యమే అని కోర్టు తేల్చి చెప్పింది.

2025లో జరిగిన రూ.100 కోట్ల స్కామ్ కేసులో నేరస్థులకు జీవిత ఖైదు పడటాన్ని ప్రస్తావిస్తూ, ఇలాంటి మోసాలను ఆర్థిక ఉగ్రవాదంగా పరిగణించాలని అభిప్రాయపడింది. గత నాలుగేళ్లలో మన దేశంలో సైబర్ మోసాల వల్ల ప్రజలు దాదాపు రూ. 52 వేల కోట్లు  కోల్పోయారని, ఇది కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

►ALSO READ | హెయిర్ కటింగ్ వివాదం: రూ. 2 కోట్ల పరిహారానికి రూ.25 లక్షలు విధించిన సుప్రీంకోర్టు!

బీఎంఎల్ ముంజాల్ వర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ దీపికా ధింగ్రా మాట్లాడుతూ.. ఈ తీర్పు వల్ల బాధ్యత వ్యక్తుల నుండి సంస్థలకు మారుతుందని, ఇది బాధితులకు ఊరటనిస్తుందని అన్నారు. అలాగే ఆత్‌బ్రిడ్జ్ సీఈఓ అజయ్ ట్రెహాన్ మాట్లాడుతూ.. బ్యాంకులు కేవలం లాభాల కోసమే కాకుండా, కస్టమర్ల డేటా భద్రత కోసం కఠినమైన నిబంధనలు పాటించాలని సూచించారు.

ఈ మోసాలను అరికట్టడానికి ఆర్‌బీఐ (RBI) ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర హోం శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనివల్ల మోసపోయిన వెంటనే స్పందించడం, అకౌంట్స్ చెక్ చేయడం ఈజీ అవుతుంది.