హైదరాబాద్ మల్లాపూర్లో కారుతో ఢీకొట్టి.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిండ్రు

హైదరాబాద్ మల్లాపూర్లో  కారుతో ఢీకొట్టి..  కిలోమీటర్  ఈడ్చుకెళ్లిండ్రు
  • తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలైన బాధితుడు 
  • హైదరాబాద్ మల్లాపూర్​లో దారుణం 
  • ఇద్దరు యువకుల అరెస్ట్

మల్కాజిగిరి, వెలుగు: హైదరాబాద్​మల్లాపూర్​లో ఘోర  ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు బొలెరో కారుతో ఢీకొట్టి కిలోమీటర్ దూరం ఈడ్చుకెళ్లారు. ఈ నెల 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రాంపల్లికి చెందిన సతీశ్ కుమార్(45) సిటీలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 9న రాత్రి పానుగంటి రాజు అనే వ్యక్తితో కలిసి కారులో మల్లాపూర్ నుంచి రాంపల్లికి బయలు దేరారు. 

మల్లాపూర్ ఎక్స్ రోడ్ వద్ద గవర్నమెంట్​స్టిక్కర్​తో కూడిన ఒక బొలెరో వాహనం వీరి కారును ఢీకొట్టి సైరన్​వేసుకుంటూ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో బాధితులు బొలెరో కారును వెంబడిస్తూ హెచ్‌బీ కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వద్ద అడ్డుకున్నారు. అనంతరం సతీశ్ కారు దిగి వారిని ప్రశ్నిస్తుండగానే ఆకతాయిలు బొలెరోతో మళ్లీ ఢీకొట్టారు. దీంతో బానెట్‌పై పడిపోయిన సతీశ్​ను అలాగే కిలోమీటర్ వరకు ఈడ్చుకొని వెళ్లారు. కారు నెంబర్ ప్లేట్ బంపర్​ను పట్టుకొని ఉన్న బాధితుడు కాసేపటికి కిందపడగా, కారు వెనుక టైరు అతడి మీది నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో సతీశ్ కుమార్​కు తీవ్ర గాయాలు కాగా,  ఆసుపత్రికి తరలించారు.  రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను సంతోష్​నగర్​కు చెందిన ఉప్పరి మహేశ్(23), బాలాజీనగర్​కు చెందిన అరగండ్ల తరుణ్(22)గా గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిని శనివారం రిమాండ్​కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.