ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..ప్రధాని మోదీ కారణమంటూ లేఖ రాసినట్లు ప్రచారం..

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య..ప్రధాని మోదీ కారణమంటూ లేఖ రాసినట్లు ప్రచారం..
  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఘటన

రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన పిట్ల వంశీ (25) పెయింట్ వేసే పని చేస్తుంటాడు. బుధవారం సాయంత్రం తల్లితో గొడవ పడిన వంశీ ఇంట్లోంచి బయటకు వెళ్లి పోయాడు. రాత్రి 10 గంటల టైంలో తిరిగి వచ్చి తన గదిలోకి వెళ్లాడు. గురువారం ఉదయం వంశీ తండ్రి బాలయ్య గదిలోకి వెళ్లి చూసే సరికి ఉరి వేసుకొని కనిపించాడు. కుటుంబ సభ్యులు, స్థానికులతో కలిసి కిందికి దించే సరికి చనిపోయి కనిపించాడు. 

కాగా, వంశీ ఆత్మహత్యకు ముందు ఎన్యూమరేషన్ ఫాం పై 'నేను చనిపోవడానికి కారణం పీఎం నరేంద్ర మోదీ. అంతే కానీ నా చావుకి నా ఫ్యామిలీ మాత్రం కారణం కాదు. దయచేసి ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా దహన సంస్కరణలు జరిపించాలి' అని నోట్ రాసినట్లు ప్రచారం జరుగుతోంది. వంశీ తండ్రి  బాలయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి తెలిపారు. 

ఇదిలా ఉండగా... నీట్ విద్యార్థులకు అన్యాయం జరిగిందన్న ఆందోళనతో పాటు ఢిల్లీలో యువకుల నిరసనను పోలీసులు అణచివేయడం చూసి తట్టుకోలేకే వంశీ ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్​ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, కాంగ్రెస్ నాయకులు దొమ్మాటి నర్సయ్య, మండల అధ్యక్షుడు రాజేందర్ ఆరోపించారు.