కరోనాతో వార్‌‌: 45 రోజులుగా అంబులెన్సే ఇల్లు

కరోనాతో వార్‌‌: 45 రోజులుగా అంబులెన్సే ఇల్లు
  • వార్‌‌ అయిన తర్వాత ఇంటికి
  • 65 ఏళ్ల అంబులెన్స్‌ డ్రైవర్‌‌ నిర్ణయం

బరేలీ: ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కంటికి కనిపించని మహమ్మారి కరోనా వైరస్‌ నుంచి మనల్ని కాపాడేందుకు ఎంతో మంది కరోనా వారియర్స్‌ పోరాడుతున్నారు. మెడికల్‌ సిబ్బంది, శానిటేషన్‌ వర్కర్లు, పోలీసులు చాలా మంది మన కోసం డ్యూటీలు చేస్తున్నారు. ఇళ్లకు కూడా వెళ్లకుండా భార్య, పిల్లల్ని వదిలేసి డ్యూటీ చేస్తున్నారు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఈ 65 ఏళ్ల అంబులెన్స్‌ డ్రైవర్‌‌ బాబు భారతి దాదాపు 45 రోజుల నుంచి ఇంటికి వెళ్లకుండా డ్యూటీ చేస్తున్నాడు. మార్చి 23 నుంచి జిల్లాలోని హాట్‌స్పాట్‌లలోని పేషంట్లను తరలిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి అంబులెన్స్‌నే ఇల్లుగా చేసుకుని అందులో ఉంటున్నాడు. కరోనా మహమ్మారిపై పోరాటం ముగిసే వరకు ఇంటికి వెళ్లేది లేదని బాబు చెప్పారు. “ నేను అంబులెన్స్‌లోనే నిద్రపోతాను. ఫీల్డ్‌కి వెళ్లినప్పుడు అవకాశం ఉన్న దగ్గర స్నానం చేస్తాను. తిండి హాస్పిటల్‌ వాళ్లు అందిస్తారు. కరోనాపై యుద్ధం ముగిసిన తర్వాతే ఇంటికి వెళ్తాను” అని బాబు చెప్పారు. రోజు ఇంట్లో వాళ్లతో మాట్లాడతానని, వారికి ధైర్యం చెప్తానని అన్నారు. రోజు అంబులెన్స్‌ను కచ్చితంగా శానటైజ్‌ చేసి జాగ్రత్తలు పాటిస్తానని చెప్పారు. బాబు 24 గంటలు అంబులెన్స్‌తో రెడీగా ఉంటారని, ఇప్పటి వరకు దాదాపు 700 మంది పేషంట్లను హాస్పిటల్‌కు తీసుకొచ్చాడని ర్యాపిట్‌ యాక్షన్‌ టీమ్‌ ఇంచార్జ్‌ డాక్టర్‌‌ నీరజ్‌ శర్మ చెప్పారు.