కందనూలు, వెలుగు : నకిలీ డీఏపీ అమ్మి మోసం చేశారని ఆరోపిస్తూ ఓ రైతు డీఏపీ బస్తాలను ఎడ్ల బండిపై వేసుకొని కలెక్టరేట్ కు వెళ్లేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళ్తే... నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన రైతు భీంరెడ్డి ఇటీవల ఓ వ్యాపారి వద్ద డీఏపీ కొనుగోలు చేశాడు. అవి నకిలీ ఎరువులను తేలడంతో సదరు వ్యాపారిని కలిసి డబ్బులు తిరిగివ్వాలని కోరగా.. పట్టించుకోలేదు.
దీంతో తనకు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానంటూ డీఏపీ బస్తాలను ఎడ్లబండిపై వేసుకొని నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కు బయలుదేరాడు. పాలెం గ్రామం వద్ద రైతుకు సీపీఐ నాయకులుఈర్ల చంద్రమౌళి, కృష్ణాజీ మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు పాలెం వద్ద రైతును అడ్డుకొని స్టేషన్ కు తీసుకెళ్లారు. నకిలీ డీఏపీ కారణంగా పంటలకు తీవ్ర నష్టం జరిగిందని, తనకు న్యాయం చేయాలని సరదు రైతు కోరారు.
నకిలీ యూరియా సీజ్
కల్వకుర్తి, వెలుగు : కోరమాండల్ పేరుతో నకిలీ యూరియా విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం లింగసానిపల్లికి చెందిన అశోక్ రెడ్డి నకిలీ యూరియాను నిల్వ చేసినట్లు తెలియడంతో కల్వకుర్తి అగ్రికల్చర్ ఆఫీసర్ సురేశ్తనిఖీలు నిర్వహించారు. యూరియా నకిలీదని తేలడంతో కల్వకుర్తి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అశోక్ రెడ్డి వద్ద ఉన్న 24.5 క్వింటాళ్ల యూరియాను సీజ్ చేసి, అతడిపై కేసు నమోదు చేశారు.
