Manchu Manoj: బర్త్ డేకు ముందే గొప్ప నిర్ణయం.. ‘AIKYA’తో సమాజ సేవలోకి మనోజ్-మౌనిక జంట..

Manchu Manoj: బర్త్ డేకు ముందే గొప్ప నిర్ణయం.. ‘AIKYA’తో సమాజ సేవలోకి మనోజ్-మౌనిక జంట..

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj) మే20న తన 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ వేడుకలకు ముందే సేవా కార్యక్రమాలతో ముందడుగు వేస్తున్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాను, తన భార్య భూమా మౌనిక కలిసి ‘ఐక్య ధైర్య సేన సమితి’ అనే సేవా సంస్థను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మానవత్వం, సేవా భావం, సమాజానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

జీవితంలో ఎదురైన అనుభవాలు మానవత్వం విలువను మరింత దగ్గర చేశాయని, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం తమ జీవితంలో ఎప్పటి నుంచో భాగమని ఈ సందర్భంగా మనోజ్ పేర్కొన్నారు. ఈ సేవా భావానికి ఇప్పుడు ఒక రూపం ఇచ్చి మరింత మందికి చేరువయ్యేలా చేయడమే తమ లక్ష్యమని మనోజ్ వెల్లడించారు.

AIKYA అంటే ఐక్యత అని, మానవత్వం కోసం కలిసి రావడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రక్తదానం, అత్యవసర సహాయం, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మనోజ్ తెలిపారు. ఇందులో భాగంగా ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకుని చదివించనున్నట్లు మనోజ్ నిర్ణయించుకున్నారు. ఇది తన భార్య ఆలోచన అని వెల్లడించారు.

ఇది రాజకీయ కార్యక్రమం కాదని, మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరిదీ అని స్పష్టం చేశారు. గొప్ప లక్ష్యం కోసం మనసులు కలిస్తే జీవితాల్లో మార్పుతో పాటు ఆశ కూడా పుడుతుందని మనోజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మనోజ్ తీసుకున్న నిర్ణయానికి సినీ ప్రముఖులు, తమ అభిమానుల నుంచి గొప్ప నిర్ణయం అంటూ ట్వీట్స్ పెడుతున్నారు. 

మనోజ్ సినిమాల విషయానికి వస్తే, 

ప్రస్తుతం మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. ఈ కథ 1897 నుంచి 1922 మధ్య బ్రిటీష్ పాలన కాలం నేపథ్యంతో సాగనుందని తెలుస్తోంది. మద్రాస్ ప్రెసిడెన్సీలో పుట్టి, ఢిల్లీలో పెరిగి, బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఒక రెబెల్ వ్యక్తి కథగా ఈ సినిమా ఉండనుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాగే, మనోజ్ నుంచి ‘అహం బ్రహ్మాస్మి’, ‘వాట్ ద ఫిష్’ చిత్రాలతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతేకాకుండా మరో రెండు సినిమాలను కూడా హీరోగా లైన్‌లో పెట్టినట్లు సమాచారం.