వేములవాడ, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న గుడి చెరువు మైదానంలో నిద్రిస్తున్న ఓ భక్తురాలి మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. సోమవారం నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్ గ్రామానికి చెందిన మాముళ నవనీత కుటుంబ సభ్యులతో కలిసి రాజన్న దర్శనానికి ఆదివారం రాత్రి వేములవాడకు చేరుకున్నారు. రాజన్న గుడి చెరువు పార్కింగ్ ప్రాంతంలో కుటుంబసభ్యులతో కలిసి నిద్రిస్తుండగా తెల్లవారుజామున ఆమె మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కునేందుకు ప్రయత్నించారు. బాధితురాలు ప్రతిఘటించగా, నిందితులు ఆమె మెడను పట్టుకొని నోటిని చేతులతో మూసి, పుస్తెలతాడును లాక్కొని బైక్‌పై పరారయ్యారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను వేములవాడ నంది కమాన్ వద్ద పట్టుకున్నారు. వారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండపల్లికి చెందిన అకమ్మ అశోక్, పంజా చందుగా గుర్తించారు. నేరానికి ముందు సిద్ధిపేట హాస్పిటల్ వద్ద పార్క్ చేసిన బైక్‌ను చోరీ చేశారు. అదే బండిపై వేములవాడకు వచ్చి ఈ చోరీకి పాల్పడ్డారు. 24 గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి నిందితులను అరెస్ట్ చేసిన ఎస్‌ఐ రాంమోహన్, పీసీలు గోపాల్, పంతులు, బ్లూ కోల్ట్స్ పీసీ సంపత్‌ను సీఐ అభినందించారు.
