చెట్లంటే ప్రాణం.. అందుకే అంబాసిడర్​

చెట్లంటే ప్రాణం.. అందుకే అంబాసిడర్​

ఈ చిన్నారి బహుశా ఎవరికీ తెలిసుండదు. తొమ్మిదేళ్ల ఈ చిన్నారి పేరు వాలెంటినా ఎలంబం. మణిపూర్​లోని కాక్షంగ్​ జిల్లాలో ఉంటుంది. తాను పెంచిన రెండు చెట్లను కొట్టేశారని కన్నీరుమున్నీరైంది ఆ చిన్నారి. ఆ వీడియోను ఆమె బాబాయి ఫేస్​బుక్​లో పోస్ట్​ చేయడంతో అప్పట్లో అది బాగా వైరల్​ అయింది. ఇప్పుడు ఆ చిన్నారినే పచ్చదనానికి అంబాసిడర్​ చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. హియాంగ్లం వాబగైలోని అముటోంబి డివైన్​ లైఫ్​ స్కూల్​లో ఐదో తరగతి చదువుతోంది వాలెంటినా. ఆమె ఒకటో తరగతి చదువుతున్నప్పటి నుంచే మొక్కలపై మమకారం పెంచుకుంది.

తన ఇంటికి సమీపంలోని నది ఒడ్డున రెండు మొక్కలను నాటింది. ఐదేళ్లకు అవి పెరిగి పెద్దవయ్యాయి. ఇటీవల నది ఒడ్డును శుభ్రం చేయడంలో భాగంగా అధికారులు ఆ రెండు చెట్లను కొట్టేశారు. దీంతో ఆ చిన్నారి చాలా బాధపడింది. వాటి దగ్గరకెళ్లి ఏడ్చేసింది. ఆ రెండు చెట్లను తానే పెంచానని, వాటిని ఇలా కొట్టేస్తుంటే చాలా బాధేస్తోందని ఏడుస్తూనే చెప్పేసింది. ఆ వీడియో సోషల్​ మీడియాలో బాగా వైరల్​ అవ్వడంతో సీఎం బిరెన్​ సింగ్​ వరకూ వెళ్లింది ఆ వ్యవహారం. చెట్లపై ఆ చిన్నారికి ఉన్న ప్రేమను చూసి గ్రీన్​ మణిపూర్​ మిషన్​కు బ్రాండ్​ అంబాసిడర్​గా ఆమెను ప్రకటించారు. ఏడాది పాటు ఆ చిన్నారి ఆ హోదాలో ఉంటుంది. ప్రభుత్వం తమకు ఇంత మంచి గౌరవం ఇవ్వడం ఆనందంగా ఉందని చిన్నారి తల్లి షాయా చెప్పారు.