మూడవ క్వార్టర్ లో పడిపోయిన మారుతి లాభం

మూడవ క్వార్టర్ లో పడిపోయిన మారుతి లాభం

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి నికరలాభం డిసెంబర్ 2021తో ముగిసిన మూడవ క్వార్టర్​లో 47.82 శాతం తగ్గి  రూ. 1,041.8 కోట్లకు పడిపోయింది. సెమీకండక్టర్ కొరత,  ధరల పెరుగుదల కారణంగా అమ్మకాలు తగ్గాయి. ఈ  ఆటో  కంపెనీ గత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–-డిసెంబర్ కాలంలో రూ. 1,996.7 కోట్ల   నికర లాభం సాధించింది.  మొత్తం ఆదాయం రూ. 23,471.3 కోట్ల నుంచి రూ.23,253.3 కోట్లకు తగ్గింది. తాజా క్వార్టర్​లో అమ్మకాలు 13.1 శాతం తగ్గి 4,30,668 యూనిట్లకు చేరుకున్నాయి. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 4,95,897 యూనిట్లను అమ్మింది. ఎలక్ట్రానిక్​ కాంపోనెట్లు తగినన్ని దొరక్కపోవడంతో 90 వేల యూనిట్లను తక్కువగా తయారు చేశామని రెగ్యులేటరీ ఫైలింగ్​లో పేర్కొంది. డిమాండ్​కు ఇబ్బంది ఏమీ లేదని, ప్రస్తుతం 2.40 లక్షల ఆర్డర్లు పెండింగ్​లో ఉన్నాయని ప్రకటించింది. సెమీకండక్టర్ల సరఫరా పెరుగుతున్నందున రాబోయే క్వార్టర్​లో ప్రొడక్షన్​ మెరుగుపడుతుందని పేర్కొంది. స్టాండ్​ఎలోన్​ లెక్కన చూస్తే కంపెనీ నికలాభం రూ.1,941 కోట్ల నుంచి రూ.1,011 కోట్లకు పడిపోయింది. నెట్​ సేల్స్​విలువ రూ.22,236 కోట్ల నుంచి రూ.22,187 కోట్లకు పడిపోయింది. దేశీ  మార్కెట్‌‌‌‌లో కంపెనీ అమ్మకాలు గత  క్యూ3లో 4,67,369 యూనిట్ల నుంచి  ఈ క్వార్టర్​లో3,65,673 యూనిట్లకు పడ్డాయి.  అయితే ఇదే క్వార్టర్​లో అత్యధికంగా 64,995 యూనిట్లను ఎగుమతి చేసింది. 2020–-21 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో 28,528 యూనిట్లను మాత్రమే విదేశాలకు అమ్మింది. డిసెంబర్ 31, 2021తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి రూ. 2,003.7 కోట్ల  నికర లాభాన్ని సాధించింది. గత ఏడాది క్యూ3లో ఇది రూ. 3,148 కోట్లుగా రికార్డయింది. మొత్తం ఆదాయం రూ.61,580.6 కోట్లు ఉంది.  గత ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో  ఇది రూ.46,337.5 కోట్లు.