సమ్మర్ క్యాంపుల్లో మస్తు ఎంజాయ్

సమ్మర్ క్యాంపుల్లో మస్తు ఎంజాయ్
  •      జీహెచ్ఎంసీ తో పాటు ప్రైవేట్ క్యాంపుల్లో  పిల్లల రద్దీ 
  •     స్విమ్మింగ్, క్రికెట్, షటిల్ గేమ్స్ కు ఎక్కువ డిమాండ్

 హైదరాబాద్, వెలుగు: సిటీ లో జీహెచ్ఎంసీతో పాటు ప్రైవేట్ సెంటర్లలో సమ్మర్ క్యాంపుల్లో పిల్లలు మస్త్  ఎంజాయ్ చేస్తున్నారు.  గతేడాది మేలో ఇదే సమయానికి కేవలం 4, 000 లోపు రిజిస్ర్టేషన్లు మాత్రమే వచ్చాయి. ఈ ఏడాది  16, 000 మంది రిజిస్ర్టేషన్స్ చేసుకున్నారు.  అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ లో 8000 మంది ఉండగా, సికింద్రాబాద్ జోన్ లో 3,000 మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారు.  మిగతా నాలుగు జోన్లలో వెయ్యిమంది చొప్పున రిజిస్ర్టేషన్ చేసుకున్నారు.

మరోవారం రోజుల్లో ఈ సంఖ్య 50 వేల వరకు పెరిగే చాన్స్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సమ్మర్ క్యాంపుల్లో ఎక్కువగా స్విమ్మింగ్, క్రికెట్, షటిల్  గేమ్స్ కు ఫుల్  డిమాండ్ ఉంది. ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం వీటికోసమే ఉన్నాయి. అటు ప్రైవేట్ సెంటర్లలోనూ వీటికే ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో స్విమ్మింగ్ పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు.  గత నెల 25 నుంచి ప్రారంభమైన జీహెచ్ఎంసీ సమ్మర్ క్యాంపులు  ఈనెల 31వ తేదీ వరకు కొనసాగుతాయి. 

సెంటర్లని బట్టి ఫీజులు

ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను బట్టి ఫీజులు ఉన్నాయి. సిటీలో ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్ 300 లకుపైనే ఉన్నాయి.   ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో అన్నిచోట్ల రద్దీ ఉంది.  స్కూల్స్, కాలేజీలకు హాలీడేస్ కావడంతో పిల్లలు పెద్ద ఎత్తున వెళ్తున్నారు.  పెద్దలు కూడా  స్విమ్మింగ్ కు వస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.  ప్రైవేట్ సెంటర్లలో స్విమ్మింగ్  పూల్స్ ని బట్టి రోజుకు 100 నుంచి 500 దాకా తీసుకుంటున్నారు. 
 
44 రకాల క్రీడల్లో శిక్షణ 

అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా వంటి 44 రకాల  గేమ్స్​లో కోచింగ్ ఇస్తున్నారు. ఇందులో షటిల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ క్రీడలకు రూ.50 ఉండగా, మిగతా అన్నింటికి రూ.10 మాత్రమే ఫీజు ఉంది.

రిజిస్ర్టేషన్ సమయంలో చెల్లిస్తే సరిపోతుంది. క్యాంపులు పూర్తయిన తర్వాత జీహెచ్ఎంసీ తరపున సర్టిఫికెట్ కూడా అందిస్తారు. 6  నుంచి 16 ఏండ్లలోపు ఉండి ఆసక్తి ఉన్నవారు   sports.ghmc.gov.in వెబ్ సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని , ఈ నెలాఖరు వరకు కొనసాగుతాయని ఖైరతాబాద్ జోన్ గేమ్స్ ఇన్ స్పెక్టర్ మాధవి తెలిపారు.