- ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట
- ఆలయానికి రూ.57,76,291 ఆదాయం
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాలు రద్దీగా కనిపించాయి. కొండపైన, కింద ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట టైం పట్టింది.
ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తుల కారణంగా కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, సత్యనారాయణస్వామి వ్రత మండపం, పార్కింగ్ ఏరియా, కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయాయి. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు లక్ష్మీపుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే ఆలయంలో స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవ పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.57,76,291 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.23,09,050, వీఐపీ టికెట్ల ద్వారా రూ.9.90 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8 లక్షలు, బ్రేక్ దర్శనాల ద్వారా రూ.4,72,500, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,79,850, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.1,94,400, యాదరుషి నిలయం ద్వారా రూ.2,41,472, కల్యాణకట్ట ద్వారా రూ.1.65 లక్షలు, సువర్ణపుష్పార్చన పూజల ద్వారా రూ.1,06,148 ఇన్‌కం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.
