మాథ్స్ టీచర్, క్లర్కును చెట్టుకు కట్టేసి కొట్టారు

మాథ్స్ టీచర్, క్లర్కును చెట్టుకు కట్టేసి కొట్టారు

రాంచీ: జార్ఖండ్‌‌లో దారుణం జరిగింది. దుమ్కా జిల్లాలోని రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు.. తమ మాథ్స్ టీచర్, క్లర్కును చెట్టుకు కట్టేసి కొట్టారు. 9వ తరగతి ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వేశారనే కోపంతో స్టూడెంట్లు దాడికి దిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఉపాధ్యాయుడు సుమన్ కుమార్‌‌, క్లర్క్ సోనేరామ్ చౌరే పై ఈ దాడి జరిగిందన్నారు. ఈ ఘటన గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ షెడ్యూల్డ్ ట్రైబ్ రెసిడెన్షియల్ స్కూల్‌‌లో సోమవారం చోటుచేసుకుందని వెల్లడించారు.

జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్(జేఏసీ) ఇటీవల 9వ తరగతి పరీక్ష ఫలితాలను ప్రకటించిందని.. మొత్తం32మంది స్టూడెంట్లల్లో 11మంది గ్రేడ్--డిడి(డబుల్ డి)తో ఫెయిల్‌‌ అయ్యారని వివరించారు. ఫెయిల్​అయిన విద్యార్థులంతా కలిసి టీచర్, క్లర్క్ పై దాడి చేశారని చెప్పారు. ఘటనపై స్కూల్ యాజమాన్యం, దాడికి గురైన టీచర్, క్లర్క్ ఫిర్యాదు చేయకపోవడంతో ఎఫ్‌‌ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు.