వైద్యశాఖలో బదిలీల ప్రక్రియ ఆలస్యం!

వైద్యశాఖలో బదిలీల ప్రక్రియ ఆలస్యం!

హైదరాబాద్, వెలుగు: వైద్యారోగ్యశాఖలో బదిలీల పర్వం ఆలస్యం అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ బదిలీల ప్రక్రియను ఈనెల 1 నాటికే పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ పూర్తి కాలేదు. తొలుత ఒకేచోట నాలుగేండ్లకు పైగా పనిచేస్తున్న వారిని గుర్తించి, మొత్తం పోస్టుల్లో 40 శాతం మేర బదిలీలు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అయితే, ఒకే స్టేషన్‌‌ లో మూడేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్నవారికి కూడా బదిలీల్లో అవకాశం కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. మూడేండ్ల సర్వీస్ ఉన్న వారిని బదిలీల పరిధిలోకి తీసుకురావాలంటే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవడం తప్పనిసరి అవసరం. దీంతో వైద్యారోగ్యశాఖ.. ఆర్థిక శాఖకు ఫైల్ పంపింది. అక్కడి నుంచి క్లియరెన్స్ రాగానే బదిలీల ఉత్తర్వులిచ్చేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంది.