మెడిసిన్స్​ రేట్లు 10 శాతం పెంచుకునేందుకు అనుమతి

మెడిసిన్స్​ రేట్లు 10 శాతం పెంచుకునేందుకు అనుమతి
  • పారాసిటమాల్​, ఎజిత్రోమైసిన్​ రేట్లు పెరుగుతున్నయ్
  • 10 శాతం పెంపునకు ఓకే
  • 850 మెడిసిన్స్​ రేట్లు పెరుగుతాయి
  • ఎన్​పీపీఏ నోటిఫికేషన్​ 

వెలుగు, బిజినెస్​ డెస్క్​: పెట్రోల్​, డీజిల్​, ఎల్​పీజీ, కూరగాయలు, ఫుడ్​ ప్రొడక్ట్స్​ రేట్ల పెరుగుదలతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై మెడిసిన్స్​ రూపంలో ఇప్పుడు మరో భారం పడనుంది. వచ్చే నెల 1 వ తేదీ నుంచి పారాసిట్మాల్, ఎజిత్రోమైసిన్​ వంటి ఎసెన్షియల్​ మెడిసిన్స్​ రేట్లు పెరగనున్నాయి. ఎసెన్షియల్​ మెడిసిన్స్​ లిస్టులోని 850 మెడిసిన్స్​ రేట్లను 10 శాతం పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. టోకు రేట్ల సూచీ (హోల్​సేల్​ ప్రైస్​ ఇండెక్స్​) ఆధారంగా ప్రతీ ఏడాదిలాగే మెడిసిన్స్​ రేట్లను పెంచనున్నారు. దేశంలో మెడిసిన్స్​ రేట్లను నియంత్రించే నేషనల్​ ఫార్మాస్యూటికల్స్​ ప్రైసింగ్​ అథారిటీ (ఎన్​పీపీఏ) ఈ రేట్ల పెరుగుదల విషయం వెల్లడించింది. 2021 లో టోకు రేట్ల సూచీ పెరుగుదల 10.8 శాతంగా ఉంది. జనం ఎక్కువగా వాడే పెయిన్​ కిల్లర్లు, యాంటి–ఇన్ఫెక్టివ్స్​, కార్డియాక్, యాంటి బయాటిక్స్​ వంటి చాలా మెడిసిన్స్​ ఈ ఎసెన్షియల్​ మెడిసిన్స్​ లిస్టులో ఉన్నాయి. షెడ్యూల్డ్​ డ్రగ్స్​ జాబితాలోని ఈ మెడిసిన్స్​ రేట్లు 10 శాతం పెరగడం ఇదే మొదటిసారి అవుతుంది. నాన్–షెడ్యూల్డ్ డ్రగ్స్​ రేట్లు మాత్రమే ఈ స్థాయిలో పెంచుకోవడానికి సాధారణంగా అనుమతి ఇస్తున్నారు.
గత కొన్నేళ్ల డేటా చూస్తే టోకు రేట్ల సూచీ ప్రకారం ఏటా పెరుగుదల 1–2 శాతం మధ్యనే ఉంటోంది. ఉదాహరణకు 2019 లో ఎసెన్షియల్​ మెడిసిన్స్​ రేట్లను 2 శాతం పెంచుకోవడానికి ఎన్​పీపీఏ అనుమతి ఇచ్చింది. ఇక 2020 లోనైతే ఈ రేట్లు 0.5 శాతమే పెంచారు. రాబోయే కొన్ని రోజులలో షెడ్యూల్డ్​ ఫార్ములేషన్స్​ సీలింగ్​ రేట్లను ఎన్​పీపీఏ ప్రకటించనుంది.

ఫార్మా ఇండస్ట్రీకి సంతోషమే....
బల్క్​ డ్రగ్స్​ రేట్ల పెరుగుదలతోపాటు, ఇతర ఖర్చులూ పెరిగి ఇబ్బందులెదుర్కొంటున్న ఫార్మా ఇండస్ట్రీకి మాత్రం ఇది గుడ్​న్యూసే. కరోనా టైములో యాక్టివ్​ ఫార్మాస్యూటికల్​ ఇన్​గ్రీడియెంట్స్​ (ఏపీఐ), రవాణా, ప్లాస్టిక్స్​, ఇతర ప్యాకేజింగ్​ మెటీరియల్స్​ వంటి వాటి ఖర్చులు భారీగా పెరిగాయి. దీంతో ఫార్మా ఇండస్ట్రీ చిక్కుల్లో పడింది. కొత్త రేట్ల ప్రకటన వెలువడితే పరిశ్రమ కష్టాల నుంచి బయటపడుతుందని ఒక కంపెనీ ప్రతినిధి చెప్పారు. దిగుమతి చేసుకుంటున్న కొన్ని రా మెటీరియల్స్​ రేట్లయితే ఏకంగా 60 నుంచి 70 పెరిగాయని పేర్కొన్నారు. ఫ్రైట్​, ఇతర రవాణా,  ప్యాకేజింగ్​ ఖర్చులు అలాగే పెరిగాయని చెప్పారు. ఫలితంగా రేట్లను 20 శాతం పెంచాలని కిందటేడాదే ప్రభుత్వాన్ని కోరామని వెల్లడించారు. కార్డియో వాస్కులార్​, డయాబెటిస్​, యాంటిబయాటిక్స్​, యాంటి–ఇన్ఫెక్టివ్స్​, విటమిన్స్​ వంటి మెడిసిన్స్​ తయారీకి ఏపీఐలు, ఇంటర్మీడియెట్స్​ను చైనా నుంచే మన దేశం దిగుమతి చేసుకుంటోంది. కొన్ని రా మెటీరియల్స్​లోనైతే 80 నుంచి 90 శాతం దాకా అవసరాలకు ఆ దేశం మీదే ఆధారపడుతున్నాం. 2020 లో కరోనా వైరస్​ ఎఫెక్ట్​ మొదలైనప్పటి నుంచీ చైనా నుంచి రా మెటీరియల్స్​ సప్లయ్​లు తగినంతగా రావడం లేదు. దీంతో కొరత పెరిగి రేట్లు అధికమయ్యాయి. ఫలితంగా ఫార్మా కంపెనీల తయారీ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి.