13 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

13 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
  •     ఏప్రిల్​లో 1.26 శాతంగా నమోదు

న్యూఢిల్లీ:   ఆహార వస్తువుల ధరలు, ముఖ్యంగా కూరగాయల ధరలు పెరగడంతో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో టోకు ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠ స్థాయి 1.26 శాతానికి పెరిగింది. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా రెండు నెలలుగా పెరుగుతూ వస్తోంది. ఫిబ్రవరిలో 0.20 శాతం, మార్చిలో 0.53 శాతంగా ఉంది. గత ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 0.79 శాతంగా ఉంది. ఏప్రిల్ డబ్ల్యూపీఐ  13 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్చి 2023లో ద్రవ్యోల్బణం 1.41 శాతంగా ఉన్నప్పుడు చివరి గరిష్ట స్థాయి కనిపించింది. 

ఆహార వస్తువులు, విద్యుత్, ముడి పెట్రోలియం  సహజ వాయువు, ఆహార ఉత్పత్తుల తయారీ, ఇతర తయారీ మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఈసారి డబ్ల్యూపీఐ ఎక్కువగా ఉందని కేంద్ర వాణిజ్య,  పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం మార్చిలో 6.88 శాతం నుంచి ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 7.74 శాతానికి పెరిగింది. ఇంధనం,  పవర్​లో  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ద్రవ్యోల్బణం 1.38 శాతంగా ఉంది, గత నెలలో 0.77 శాతంగా ఉంది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 11 నెలల కనిష్ట స్థాయి 4.83 శాతానికి తగ్గింది. ఆర్‌‌‌‌‌‌‌‌బీఐ గత నెలలో వరుసగా ఏడవసారి వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది.