మల్కాజి గిరిలో మీ సురక్ష షురూ... ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి

మల్కాజి గిరిలో మీ సురక్ష షురూ...  ప్రజలు సహకరించాలని సీపీ విజ్ఞప్తి
  • ఇంటి సిబ్బంది, డ్రైవర్లు, వాచ్​మెన్​ల వివరాల సేకరణ
  •     శనివారం ఒక్కరోజే 550 ప్రాంతాల్లో తనిఖీలు
  •     ‘హాక్​ఐ ఆల్ట్రా’ యాప్ ద్వారా వివరాల నమోదు

మల్కాజిగిరి, వెలుగు: నగరంలో పెరుగుతున్న నివాస ప్రాంతాలు, మారుతున్న నేరాల ధోరణిని దృష్టిలో ఉంచుకొని మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 28 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో ‘మీ సురక్ష’ అనే వినూత్న భద్రతా కార్యక్రమాన్ని శనివారం అధికారికంగా ప్రారంభించారు. కాలనీ సంక్షేమ సంఘాల, వాలంటీర్ల సహకారంతో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్​మెంట్​లలో పనిచేసే ఇంటి సహాయకులు, వంట మనుషులు, డ్రైవర్లు, వాచ్​మెన్లు, సెక్యూరిటీ గార్డుల వివరాల సేకరణ, ధృవీకరణ కోసం దాదాపు 550 ప్రాంతాల్లో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. 

ఈ సమాచారాన్ని పూర్తిగా డిజిటల్ విధానంలో భద్రపరచడానికి ‘హాక్‌‌ఐ ఆల్ట్రా’ యాప్​తో పాటు గూగుల్ ఆన్​లైన్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫారాలను వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళల భద్రతను మెరుగుపరచడం, దొంగతనాలు, నేరాలను అరికట్టడం, కచ్చితమైన డేటాబేస్ రూపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ‘మీ సురక్ష’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలందరూ తమ ఇండ్లలో పనిచేసే సిబ్బంది వివరాలను నమోదు చేయించి సహకరించాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి విజ్ఞప్తి చేశారు.