నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోళ్లు

మంచిర్యాల,వెలుగు: ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అస్పష్ట వైఖరి కారణంగా అటు మిల్లర్లు, ఇటు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రా రైస్​కు సంబంధించి ఇంతవరకు బోనస్​ ప్రకటించకపోవడంతో వడ్లు దించుకునేందుకు మిల్లర్లు ససేమిరా అంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు స్తంభించిపోవడంతో రైతులు వడ్ల కుప్పల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఆలస్యమైన కొద్దీ అకాల వర్షాల ముప్పు పొంచి ఉందని,  ఆరుగాలం కష్టం వృథా అవుతుందని ఆందోళన చెందుతున్నారు. 

బోనస్​పై నో క్లారిటీ... 

యాసంగిలో బాయిల్డ్​రైస్​తీసుకోబోమని ఎఫ్ సీఐ తేల్చి చెప్పింది. దీంతో ప్రభుత్వం రా రైస్​ఇవ్వడానికే మొగ్గుచూపింది. యాసంగి వడ్లను నేరుగా మిల్లింగ్​చేస్తే నూక శాతం అధికంగా ఉంటుంది. క్వింటాలుకు 68 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, 20 కిలోల వరకు నూక వస్తుందని మిల్లర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మిల్లర్లకు బోనస్​ ఇస్తామని ప్రకటించింది. కానీ... బోనస్​ఎంత ఇస్తామన్నది ఇంతవరకు చెప్పలేదు. సీఎస్​ నేతృత్వంలోని కమిటీ పలుమార్లు సమావేశమైనప్పటికీ  ఏమీ తేల్చలేదు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.150 బోనస్​ఇవ్వడానికి మొగ్గుచూపుతుండగా, మిల్లర్లు రూ.300 ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. బోనస్​ ప్రకటించేంత వరకు సెంటర్ల నుంచి వచ్చే వడ్లను దించుకోబోమని చెప్తున్నారు. 

స్తంభించిన కొనుగోళ్లు... 

ప్రభుత్వం, మిల్లర్ల తీరుతో జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు స్తంభించాయి. యాసంగిలో  73వేల ఎకరాల్లో వరిపంట సాగైంది. 1.84 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా 1.54 లక్షల మెట్రిక్​ టన్నులు సేకరించేందుకు ప్రణాళిక రూపొందించారు. జిల్లావ్యాప్తంగా 221 సెంటర్లకు గాను ఇప్పటివరకు 54 మాత్రమే ఓపెన్​ చేశారు. కేవలం 8 సెంటర్లలోనే వడ్లు కాంటా వేశారు. 66 మంది రైతుల దగ్గర 633.68 మెట్రిక్ టన్నులు కొన్నారు. 433.76 మెట్రిక్​ టన్నుల వడ్లను మిల్లులకు తరలించారు. మిల్లర్లు ట్రక్ షీట్లు ఇవ్వకపోవడంతో ట్యాబ్​ఎంట్రీ కాలేదు. కాంటా వేసిన 48 గంటల్లో రైతుల అకౌంట్లలో పైసలు వేస్తామని చెప్పినప్పటికీ ఎదురుచూపులు తప్పట్లేదు. రూ.1.24 కో చెల్లింపులు పెండింగ్​ ఉన్నాయి. సంచుల కొరత సైతం వెంటాడుతోంది. జిల్లాలో 38 లక్షల 66వేల సంచులు అవసరం. ప్రస్తుతం 13 లక్షల 95 వేల 900 అందుబాటులో ఉన్నాయి. ఇంకా 24 లక్షల 70 వేల బ్యాగులు అవసరం. 

సెంటర్లలో సమస్యలెన్నో... 

కొనుగోలు కేంద్రాల్లో అనేక సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సెంటర్లలో వడ్ల కుప్పులు పోసి పదిహేను రోజులకు పైగా కాపలా కాస్తున్నారు. పగలు ఆరబోస్తూ, రాత్రి కుప్పలు పోస్తూ అవస్థలు పడుతున్నారు. పనీపాటా వదులుకొని సెంటర్ల వద్దే పడిగాపులు కాస్తున్నారు. నిలువ నీడ, తాగునీళ్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఎర్రటెండల్లో పరేషాన్​ అవుతున్నారు. టార్పాలిన్లు లేకపోవడంతో కవర్లు రెంట్​కు తీసుకుని కుప్పలపై కప్పుతున్నారు. మొన్నటి అకాల వర్షానికి సుమారు 20వేల మెట్రిక్​ టన్నుల వడ్లు తడిశాయి. మళ్లీ వానలొస్తే ఆరుగాలం కష్టం మట్టిపాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. 

పరిహారం ఇవ్వాలి

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని, తడిసిన వడ్లను కొనుగోలు చేయాలని బీజేపీ లీడర్లు డిమాండ్​చేశారు. శనివారం కలెక్టరేట్​ఎదుట కిసాన్​మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​రఘునాథ్​ వెరబెల్లి మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. సీఎం మాటలు నమ్మి వరి సాగు చేయని రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సరిపడా గన్నీ బ్యాగులను, టార్ఫాలిన్​కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. గూడెం పైప్​లైన్​ను వెంటనే మార్చాలన్నారు. నిరసనలో లీడర్లు గాదే శ్రీనివాస్, తమ్మినిడి శ్రీనివాస్, రజినీష్ జైన్, బొలిశెట్టి తిరుపతి, బొప్పు కిషన్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బియ్యాల సతీశ్​రావు, జోగుల శ్రీదేవి, బోడకుంట ప్రభ, పట్టి వెంకట కృష్ణ, ముదాం మల్లేశ్, బుద్దారపు రాజమౌళి, నాగుల రాజన్న, పచ్చ వెంకటేశ్వర్లు, రాజనర్సు, రాజేశ్, తోట తిరుపతి, రైతులు  
పాల్గొన్నారు.

మొత్తం సెంటర్లు  221
ఓపెన్​  చేసినవి  54
కొనుగోలు చేస్తున్నవి  08
ధాన్యం టార్గెట్​   1.54  లక్షల టన్నులు
కొనుగోలు చేసింది   633.68   టన్నులు
ధాన్యం విలువ  1.24 కోట్లు