వాణిజ్య పంటలకు అందని ప్రభుత్వ సహకారం

వాణిజ్య పంటలకు అందని ప్రభుత్వ సహకారం

సంగారెడ్డి జిల్లాలో  చాలామంది రైతులు ఎప్పటి  నుంచో  కుసుమ,  నువ్వు, జొన్న, ఆలు ,  అరటి లాంటి  రక రకాల పంటలు  సాగు చేస్తుంటారు.  ప్రత్యామ్నాయ పంటలేస్తున్న అన్నదాతలకు... ప్రభుత్వం ఇప్పటికీ అండగా నిలవలేదు.  నాణ్యమైన విత్తనాలు  దొరక్క.. నిల్వ చేసేందుకు  గోడౌన్ లు, మార్కెటింగ్  సౌకర్యం లేక  రైతులు నష్టపోతున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో వాణిజ్య పంటల సాగులో జహీరాబాద్  ప్రాంత రైతులు ముందుంటారు. ప్రకృతి అనుకూలించి, గిట్టుబాటు ధర లభిస్తే కాసుల పంట పండుతుందనే ఆశతో చాలా ఏళ్లుగా వివిధ రకాల పంటలపై దృష్టి సారించారు. ఈ ప్రాంతంలో రెతులు అరటి, అల్లం, ఎల్లిగడ్డ, పసుపు, చెరుకు, ఆలుగడ్డ పంటలు ఎక్కువగా పండిస్తారు. పలు రకాల పండ్ల తోటల సాగు సైతం ఈ జిల్లాలో పెరిగింది. ఈ ప్రాంతంలోని ఎర్ర నేలలు అల్లం, పసుపు పంటలకు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు నల్ల రేగడి, ఇసుక నేలలు, చౌడు భూములున్నాయి. వర్షాధార  భూముల్లో ఖరీఫ్ , రబీ సీజన్ల వారీగా వాణిజ్య పంటలైన పత్తి, వాము, మిరప పంటలు పండిస్తున్నారు. నీటి వసతి ఉన్న రైతులు అరటి, ఆలు, అల్లం, తో పాటు మామిడి, జామ, సపోట, బత్తాయి, బొప్పాయి లాంటి పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. 

జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఉండే రైతులు కూరగాయలు కూడా సాగు చేస్తారు. పలు రకాల పంటలను హైదరాబాద్ , పక్క రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. కానీ అధికంగా పెట్టుబడులు పెట్టే వాణిజ్య పంటల రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతోంది. పండిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు. మార్కెట్ లో వినియోగదారులకు వంద రుపాయలకు కిలో అమ్మే పంటను రైతుల దగ్గర మాత్రం పది రూపాయాల కంటే తక్కువ ధరకే కొంటున్నారు వ్యాపారులు. అరటి పండ్లు బయట వినియోగదారులు కొనుక్కుంటే డజన్ కు 50 రుపాయలు నుంచి 70 రుపాయలు ఉంది. కానీ వ్యాపారులు రైతు దగ్గర అరటి గెల మొత్తం కేవలం 40 రూపాయలకు మాత్రమే కొంటున్నారు. సూపర్ మార్కెట్లలో 30 రూపాయలకు కిలో చొప్పున అరటి పండ్లు అమ్ముతుంటే.. వ్యాపారులు మాత్రం రైతుల దగ్గర కొనేది మూడు రూపాయలకు మాత్రమే. దీంతో అరటి పండించే రైతులు ఇతర పంటల వైపు చూస్తున్నారు. అరటి సాగు చేసే రైతులకు ఇచ్చే రాయితీలను తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఎత్తేయడం కూడా సమస్యగా మారింది.

సంగారెడ్డి జిల్లాలో పండించే అల్లం, ఆలు గడ్డలకు ప్రత్యేకత ఉంది. ఆగ్రా నుండి తెచ్చిన విత్తనాలతో రైతులు ఆలుగడ్డను సాగు చేస్తుంటారు. జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ ఉంటే తమ ఆలుగడ్డ విత్తనాలు తామే తయారు చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఉత్తరప్రదేశ్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు తెచ్చుకోవాల్సి వస్తుందంటున్నారు రైతులు. దీంతో ఖర్చులు పెరిగి గిట్టుబాటు కావడం లేదంటూ వాపోతున్నారు. మరోవైపు విత్తనాల కల్తీతో పంటకు తెగులొచ్చి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి రైతులకు పంటసాగు, జాగ్రత్తలపై అధికారులు సలహాలు, సూచనలు ఇవ్వడమనేది  ఇక్కడి రైతులకు ఏ మాత్రం తెలియదు. ఇదిలా ఉంటే చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని మార్కెట్ కు పోతే 5 రూపాయల కంటే ఎక్కువ ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. మార్కెట్ లో అల్లం ధర కిలో 100 రూపాయలు ఉంటే దళారులు రైతుల దగ్గర కొనేది మాత్రం కేవలం 10 రూపాయలకే. 

గతంలో జహీరాబాద్  డివిజన్ లో రైతులు చిరు ధాన్యాలు ఎక్కువగా పండించేవారు. ఆదాయం ఆశించినంత రాకపోవడంతో రైతులు క్రమంగా వాణిజ్య పంటల వైపు దృష్టి సారించారు. మొదట్లో వాణిజ్య పంటగా చెరుకు పండించే వారు దీంతో చెరుకు క్రష్టింగ్ కోసం షుగర్ ఫ్యాక్టరీ సైతం ఇక్కడ నెలకొల్పింది అప్పటి ప్రభుత్వం. డివిజన్ లోని కోహీర్, ఝరాసంగం, న్యాల్ కల్, జహీరాబాద్, మొగుడంపల్లి ప్రాంతాల్లో నీటి సౌకర్యం ఉన్న రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో వాణిజ్య పంటలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని పలు మండలాల్లో 10వేల ఎకరాల్లో చెరుకును పండిస్తున్నారు. దాదాపు 500 ఎకరాల్లో అరటి, 500 ఎకరాల్లో జామ, 6వేల ఎకరాల్లో మామిడి, 200 ఎకరాల్లో బొప్పాయి, సపోటా, దాదాపు 6వేల ఎకరాల్లో అల్లం సాగు చేస్తున్నారు. 

ఎకరా విస్తీర్ణంలో అల్లం సాగు చేయడానికి పెట్టుబడి సాధారణ పంటలతో పోల్చితే ఎక్కువగానే ఉంటుంది. అల్లం విత్తనం పొలంలో నాటుకోవడం మొదలు నుంచి పంట చేతికి వచ్చే సరికి ఎకరాకు సుమారు 2లక్షల రూపాయల వరకు పెట్టుబడి ఖర్చు అవుతుంది. 6 నుంచి 7 ఏళ్ల వరకు పంటను తీయవచ్చు. దిగుబడి ఎకరాకు 80-150 క్వింటాళ్ల వరకు వస్తుంది. ఎకరాకు రైతు 2లక్షలు ఖర్చు చేస్తే పెట్టుబడి పోను 4 నుంచి 6లక్షల రూపాయల ఆదాయం రావాలి.. కానీ వ్యాపారులు రైతుల నుంచి అల్లం కేవలం 10 రూపాయలకే కిలో చొప్పున కొంటున్నారు. దీంతో లాభాలు పొందాల్సిన రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 

వరి సాగు వద్దంటున్న ప్రభుత్వం ఇతర పంటల రైతులకు అండగా నిలవకపోవడం పట్ల రైతు సంఘాలు మండి పడుతున్నాయి. వరికి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులకు విత్తనాల కొరత, మార్కెట్లు కొరత, కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమంటున్నారు రైతులు.

 

మరిన్ని వార్తల కోసం...

 

మెడికల్ కాలేజీ కోసం రూ.500 కోట్లు కేటాయించిన సింగరేణి