- జర్మనీలో మాస్టర్స్‌కు ఎంపికైన స్టూడెంట్‌కు రూ.10 లక్షల సాయం
హైదరాబాద్, వెలుగు: ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నిరుపేద విద్యార్థులకు సరైన అవకాశాలు కల్పిస్తే ప్రపంచ వేదికపై తమ సత్తా చాటుతారని తెలిపారు. జర్మనీలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ సీటు సాధించిన నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన నిరుపేద విద్యార్థిని పరిమళకు ఆయన రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ‘కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్’ ద్వారా ఈ చెక్కును విద్యార్థినికి అందజేశారు.
ఐఐటీ మద్రాస్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన పరిమళ జర్మనీలో మాస్టర్స్ చదివేందుకు సీటు సాధించింది. అయితే, కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ ఈ విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి కోమటిరెడ్డి.. ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించి ఆమె విదేశీ విద్యకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా విద్యార్థిని పరిమళను, ఆమె కుటుంబాన్ని మంత్రి అభినందించారు.
