హైదరాబాద్, వెలుగు: ప్రకృతి విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఎన్‌డీఎంఏ సహకారంతో నిర్వహించిన భారీ విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విపత్తులు సంభవించినప్పుడు మొదటి గంట 'గోల్డెన్ అవర్' అత్యంత కీలకమని, ఆ సమయంలో అత్యాధునిక సాంకేతికతను జోడించి వేగంగా స్పందించినప్పుడే ఆస్తి, ప్రాణ నష్టాలను తగ్గించగలమని పేర్కొన్నారు.
1908 మూసీ వరదల నుంచి నేటి గోదావరి, కృష్ణా వరదల వరకు చరిత్ర నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకుని, ప్రపంచస్థాయి పరిజ్ఞానంతో రాష్ట్ర విపత్తు నిర్వహణ వ్యవస్థను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వరదలు, అగ్నిప్రమాదాలు, పారిశ్రామిక ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో వివిధ శాఖల మధ్య సమన్వయమే రక్షణ కవచమని వివరించారు. విపత్తుల వేళ సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
