- మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
కూసుమంచి, వెలుగు: ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చే ప్రతి దరఖాస్తును మూడు నెలల్లో పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శనివారం తిరుమలాయపాలెం ఎంపీడీవో ఆఫీస్ వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్‌తో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాలలో 14,700 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, భూ సమస్యలు, పెన్షన్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు సంబంధించినవేనని తెలిపారు.
గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందని చెప్పారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు ఈ నెలాఖరు నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. ధరణి వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి భూభారతిని తీసుకొచ్చామని చెప్పారు. సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మద్దులపల్లి ఏఎంసీ చైర్మన్ హరినాథ్ బాబు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
