కేసీఆర్ చేసిన అప్పులకే ఏటా 76 వేల కోట్లు కడ్తున్నం...కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క

కేసీఆర్ చేసిన అప్పులకే ఏటా 76 వేల కోట్లు కడ్తున్నం...కేసీఆర్ కుటుంబ సభ్యుల మాటలు నమ్మొద్దు: భట్టి విక్రమార్క
  • ప్రజలు బుద్ధిచెప్పినా.. మళ్లీ మోసగించే ప్రయత్నాలు 
  • ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్న డిప్యూటీ సీఎం


వైరా, వెలుగు: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చేసిన అప్పులకు ప్రతి ఏటా అసలు, వడ్డీ కలిపి 76 వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ నెల 30న చింతకానిలో నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభపై బుధవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో భట్టి మాట్లాడారు. కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు మాయమాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారని, వారిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. 

గత ఎన్నికల్లోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పినా, ఇంకా మోసగించాలని ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండున్నర సంవత్సరాల కాలంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుతూ వస్తున్నామని అన్నారు. 

కోటీ పది లక్షల కుటుంబాలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల కోసం 13 వేల కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సర్​ను సీరియస్‌‌‌‌గా తీసుకోకుంటే ప్రమాదకరమని భట్టి విక్రమార్క అన్నారు. తమిళనాడు, బీహార్, బెంగాల్ లో అధికారంలో ఉన్న పార్టీలు సర్​పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల అక్కడ ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని అన్నారు.బూత్ లెవెల్ ఏజెంట్లు(బీఎల్‌‌‌‌ఏ) ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. సిబ్బందికి సమగ్రమైన సమాచారం అందించాలన్నారు. 

తమ పరిధిలోని ప్రతి ఓటరు పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అన్ మ్యాపింగ్ జాబితాలో ఉండిపోయిన ఓటర్ల వివరాలను సేకరించి, వారికి ఓటు హక్కు కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని పార్టీ కేడర్​ను ఆదేశించారు. 30న మధిర నియోజకవర్గం చింతకాని మండలం జగన్నాథపురంలో జరిగే రైతు ఆశీర్వాద సభను పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసాను అక్కడి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, రాష్ట్ర హస్తకళ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.