బీఆర్ఎస్ ఓడడం వల్ల నష్టపోయింది తెలంగాణే..పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులూ నిర్వహించారు: కేటీఆర్

బీఆర్ఎస్ ఓడడం వల్ల  నష్టపోయింది తెలంగాణే..పీఎం తప్ప కేసీఆర్ అన్ని పదవులూ నిర్వహించారు: కేటీఆర్
  • మహిళలకు ఇచ్చిన హామీ నెరవేరిస్తే పాలిటిక్స్ నుంచి పర్మనెంట్‌‌గా తప్పుకుంటా
  • కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేసింది
  • సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్​లో కామెంట్​

  సత్తుపల్లి, వెలుగు: బీఆర్ఎస్ ఓడిపోవడం వల్ల కేసీఆర్​కు పోయిందేమీ లేదని,  తెలంగాణే నష్టపోయిందని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. పీఎం పదవి తప్ప కేసీఆర్​ అన్ని పదవులూ నిర్వహించారని చెప్పారు. బుధవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎస్‌‌‌‌ఐఆర్ పై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ మేరకు నెలకి రూ. 2500 చొప్పున, రెండున్నరేండ్లలో బాకీ పడిన రూ. 1.5 లక్షల చొప్పున 1.65 కోట్ల మంది మహిళల అకౌంట్లలో జమచేస్తే తాను పాలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు.

 రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదని, ప్రతినెలా రాహుల్ గాంధీకి కప్పం కడితేనే ఆయన పదవి రెన్యువల్ అవుతుందని విమర్శించారు. ఈ రెండున్నర ఏళ్లలో ఎగవేతలు, కూల్చివేతలే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్​ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. 

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేసీఆర్​ రైతుబంధు స్కీమ్ అమలు చేశారని గుర్తుచేశారు. లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు తమ హయాంలో సీతారామ ప్రాజెక్టు చేపట్టామని, కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్టులో మట్టి తవ్వకాల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు జరిగిన మేలు శూన్యమన్నారు. రైతుబంధు, బోనస్, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులను ప్రభుత్వం నిరాశపరిచిందని మండిపడ్డారు. యూరియా సప్లైలో గవర్నమెంట్ విఫలమైందని, షాప్‌‌‌‌లో స్టాక్ లేకుండా యాప్‌‌‌‌లు ప్రవేశపెట్టడం వల్ల ఎలాంటి యూజ్ లేదన్నారు. 

కేసీఆర్ చేసిన అప్పులతో ప్రాజెక్టులు, 24 గంటల కరెంట్​సప్లై, పెన్షన్లు, గురుకులాలు, సంక్షేమ పథకాలు అమలు చేశారని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ మెంబర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ఈ మీటింగ్‌‌‌‌లో ఎమ్మెల్సీలు తక్కెలపల్లి రవీంద్రరావు, తాతా మధుసూదన్, నియోజకవర్గ ఇన్‌‌‌‌చార్జి కూరాకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బొమ్మెర రామ్మూర్తి, లింగాల కమల్‌‌‌‌రాజు తదితరులు పాల్గొన్నారు.