- ఈనెల మూడో వారంలో మేధోమథన మీటింగ్
- బీసీ హాస్టల్స్లో అకడమిక్ ప్రొఫైల్ రెడీ చేయండి
- స్టూడెంట్స్కు హెల్త్ టెస్ట్‌లు నిర్వహించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: బీసీల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సమగ్ర కార్యాచరణకు ఈనెల మూడవ వారంలో బీసీ సంక్షేమశాఖ అధికారులు, సహాయ బీసీ సంక్షేమశాఖ అధికారులతో మేధోమథనం సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లో బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయదేవి, అధికారులు మల్లయ్య భట్టు, అలోక్ కుమార్, శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి రివ్యూ నిర్వహించారు. బీసీ గురుకుల పాఠశాలలు, బీసీ సంక్షేమ హాస్టళ్లు పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాల కల్పన, విద్యా ప్రమాణాల పెంపుపై చర్చించనున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాస్టళ్లు ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, షూస్ తదితర అవసరమైన సామగ్రి పంపిణీ విధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే విద్యాసంవత్సరంలో 500కుపైగా మార్కులు సాధించే విద్యార్థుల సంఖ్యను పెంచేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
బీసీ గురుకులాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థుల సంఖ్య పెంపుపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థుల సమగ్ర వికాసం కోసం హాస్టళ్లలో క్రీడలకు ప్రాధాన్యం కల్పించాలన్నారు. ప్రతి విద్యార్థికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ప్రతిఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు.
బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఏడాది పొడవునా నిర్వహించాల్సిన విద్యా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలతో కూడిన అకడమిక్ ప్రొఫైల్ రూపొందించాలని సూచించారు. హాస్టళ్ల పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. బీసీ స్టడీ సర్కిళ్లలో సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
