ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీలో ఎవరినీ తొలగించం: మంత్రి పొన్నం

ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీలో ఎవరినీ తొలగించం: మంత్రి పొన్నం
  • ఏ ఒక్క డిపోనూ ప్రైవేటీకరించం 
  • ఇతర అద్దె బస్సుల మాదిరిగా ఎలక్ట్రిక్ బస్సులూ ఆర్టీసీ నియంత్రణలోనే..
  • వీటి ద్వారా వచ్చే ఆదాయం సంస్థకే 
  • మహాలక్ష్మి పథకం ద్వారా రూ.9,750 కోట్లు లాభం 
  • రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతాం 
  • అసెంబ్లీలో ఆర్టీసీపై చర్చలో మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఆర్టీసీలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించడం గానీ, ఏ ఒక్క డిపోను ప్రైవేటీకరించడం గానీ చేయబోమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్టీసీపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. డిపోల్లో ఇతర బస్సుల్లాగే ఎలక్ట్రిక్ బస్సుల కార్యకలాపాలు ఆర్టీసీ నియంత్రణలోనే ఉంటాయని చెప్పారు. ప్రైవేట్ డీజిల్ అద్దె బస్సుల మాదిరిగానే అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ ఆదేశాల మేరకే  నడుస్తాయని, వీటి టిక్కెట్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా సంస్థకే చెందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీలో భాగంగా గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్(జీసీసీ) పద్ధతి ప్రకారం ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని పేర్కొన్నారు. మూసేయాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. సంవత్సరానికి రూ.1,500 కోట్లు ఇస్తామని ప్రకటించి పదేండ్లలో  రూ.7 వేల కోట్లు కూడా ఇవ్వలేదన్నారు. కానీ, తమ ప్రభుత్వం ఈ రెండేండ్లల్లోనే రూ. 7,800 కోట్లు చెల్లించిందని చెప్పారు. ఆర్టీసీ విలీనంపై కమిటీ నివేదిక రావాల్సి ఉందన్నారు. ఆనాడు ఆదరాబాదరాగా విలీన ప్రక్రియను ప్రారంభించి వదిలేశారని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై ఉక్కుపాదం మోపి, 45 వేల మంది కార్మికులను ఇబ్బందులకు గురిచేశారని విమర్శించారు. గత ప్రభుత్వం ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని, ఒక్క నియామకం చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేద వర్గాలకు ఆర్టీసీ లైఫ్​లైన్​

పేద వర్గాలకు ఆర్టీసీ లైఫ్ లైన్ అని, ప్రజా ప్రభుత్వంలో సంస్థ ఉద్యోగులను అక్కున చేర్చుకున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ప్రభుత్వంలో సంస్థ విలీనం, యూనియన్లకు అనుమతి ఇవ్వడం..ఈ రెండు అంశాలే ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఓఆర్ఆర్ పరిధిలో 60 వేలకుపైగా ఆటోలకు అనుమతి ఇచ్చామని, హైదరాబాద్ లో రవాణా కనెక్టివిటీ పెంచడానికి మెట్రో ఎంఎంటీఎస్ తో కలిసి ఆర్టీసీ ముందుకు పోతుందన్నారు. తమ ప్రభుత్వం హైదరాబాద్ సిటీలో, శివారు ప్రాంతాల్లో  కొత్తగా 340 రూట్లలో బస్సులు నడుపుతోందని, సంస్థ నుంచి తొలగించిన 250 మందిని తిరిగి సర్వీసులోకి తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి రూ.9,750 కోట్ల లాభం వచ్చిందన్నారు. హైదరాబాద్ లో పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి వచ్చే రెండేండ్లలో 2,800 బస్సులు నడుపుతామన్నారు.

స్కిల్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్స్​

సీఎం రేవంత్​రెడ్డి బలహీన వర్గాల పక్షపాతి అని  మంత్రి పొన్నం తెలిపారు. తాము ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లను అడ్డుకోలేదని, బలహీన వర్గాల రిజర్వేషన్లకు ఎవరూ అడ్డుపడొద్దని కోరారు. రాహుల్ గాంధీ ఇచ్చిన జిత్నా అబాది ఉత్నే ఇసెదరి పిలుపు మేరకు రాష్ట్రంలో కులగణన పూర్తి చేశామన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్​మెంట్ ప్రోగ్రామ్స్​ నిర్వహిస్తున్నామని తెలిపారు. 79 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. శాంతిభద్రతల నిర్వహణ, మహిళా భద్రతలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 2025లో 509 మంది, 2026 ప్రారంభంలో కీలక నేతలతో సహా మరికొందరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. పర్యాటకుల భద్రత కోసం 80 మంది సిబ్బందితో ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించామన్నారు. పోలీసుల పిల్లల కోసం మంచిరేవులలో 50 ఎకరాల్లో స్కూల్ ఏర్పాటు చేశామని, సిద్దిపేటలో రూ.34.29 ఎకరాల్లో జైలు ప్రారంభించామని, ఖైదీల కోసం నివృత్తి వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 

ఆర్టీసీలో కొత్తగా 4,538 పోస్టులకు అనుమతి

ఆర్టీసీ సంస్థలో కొత్తగా 4,538 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, వీటిలో డ్రైవర్​ 2 వేలు, శ్రామిక్ 743, కండక్టర్ 1,500, ఇతర పోస్టులు 295 ఉన్నాయని మంత్రి ప్రభాకర్​తెలిపారు. 7 మెడికల్ ఆఫీసర్(జనరల్) పోస్టులకు సంబంధించి నియామకాలు పూర్తయ్యాయని చెప్పారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ద్వారా మొదటి దశలో 1,000  డ్రైవర్ పోస్టులు, 713 శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు తీసుకున్నట్లు తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్​లో ఆర్టీసీకి రూ.4,305.49 కోట్లు కేటాయించినందుకు ఆర్టీసీ ఉద్యోగుల తరఫున సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.