- మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి స్టూడెంట్స్‌కు ప్రతిభా పురస్కారాల ప్రదానం
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాల్లో చదివే స్టూడెంట్స్ సివిల్స్‌ను టార్గెట్గా పెట్టుకొని చదవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ర్టంలో 2 లక్షలకు పైగా విద్యార్థులు బీసీ గురుకులాలు, హాస్టళ్లలో చదువుతున్నారని, పది, ఇంటర్ ఫలితాల్లో 98 శాతం పాస్ అవడం తమకు ఎంతో గర్వకారణమని కొనియాడారు.
గురువారం బంజారాహిల్స్ కొమరం భీం భవన్లో బీసీ సంక్షేమ శాఖ, బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో అత్యుత్తమ మార్కులు సాధించిన పది, ఇంటర్ విద్యార్థులకు మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ చాలా ఏండ్ల తర్వాత టీచర్ల బదిలీలు చేపట్టామన్నారు. బలహీన వర్గాల విద్యార్థులు పోటీ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.
మంచి మార్కులు వచ్చిన విద్యార్థులను అభినందించే కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. విద్యార్థి సంఘాల ఎన్నికలు లేకుంటే తాను మంత్రి అయ్యేవాడిని కాదన్నారు. ఇటీవల విద్యా కమిషన్ విద్యార్థి సంఘాల ఎన్నికలు జరపాలని సూచించిందని గుర్తుచేశారు. 98 శాతం పైగా మార్కులు ఉంటే పోటీ చేసే అవకాశం కల్పించాలని గురుకుల సిబ్బందికి సూచించారు. ఎంజేపీ సెక్రటరీ, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం, సీఎస్ రామకృష్ణ రావు సంక్షేమ హాస్టళ్లలోనే చదివి వచ్చారన్నారు.
తెలంగాణ రైజింగ్‌లో ప్రతి స్టూడెంట్ భాగస్వామ్యం కావాలి: మంత్రి వాకిటి
తెలంగాణ రైజింగ్‌లో ప్రతి విద్యార్థి భాగం కావాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకొని వంద శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యలో ఒత్తిడి ఉండొద్దని 25 వేల మంది టీచర్లకు బదిలీలు, ప్రమోషన్లు ఇచ్చామని, భవిష్యత్‌లో బీసీలు మరింత మంది అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికై చట్టాలు చేయాలన్నారు. విద్యారంగంలో సీఎం విప్లవాత్మకంగా మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారు.
