- ప్రజాభవన్‌లో స్త్రీనిధి వార్షిక ప్రణాళిక విడుదల
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని, స్వశక్తితో ఎదిగేందుకు స్త్రీనిధి బలమైన వేదికలా నిలుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి ప్రచారాలను ఉద్యోగులంతా ఐక్యంగా తిప్పికొట్టాలని అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ‘స్త్రీనిధి వార్షిక కార్యాచరణ ప్రణాళిక’ అమలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 2011లో కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన స్త్రీనిధి.. నేడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరింత బలోపేతం అవుతోందన్నారు.
మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపుల నుంచి మహిళలను కాపాడేందుకు పుట్టిన ఈ సంస్థ.. మహిళా బ్యాంక్‌గా అవతరించిందని ప్రశంసించారు. ఇప్పటివరకు 32 లక్షల మంది మహిళలకు రూ. 24 వేల కోట్ల రుణాలు అందించడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తూ వారి జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాని చెప్పారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటైన ‘స్త్రీనిధి స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్’ను సీతక్క అభినందించారు. స్త్రీనిధి సంస్థను విజయపథంలో నడిపించిన ఎండీ విద్యాసాగర్ రెడ్డి సేవలను కొనియాడారు. త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆయనను మంత్రి సీతక్క, ఉద్యోగులు సన్మానించారు. కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ దాన కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
