టైంపాస్‌కు వచ్చి హడావుడి చేశారు: తలసాని

టైంపాస్‌కు వచ్చి హడావుడి చేశారు: తలసాని

కాంగ్రెస్ నేతలు  సెక్రటేరియెట్​కు టైంపాస్, పబ్లిసిటీ కోసం వచ్చారని, మీడియా ఉందని ఏదో హడావుడి చేశారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​​ విమర్శించారు.  30 నిమిషాల్లోనే పరిశీలించి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ఎప్పటి నుంచో సెక్రటేరియెట్​ కట్టాలని సీఎం అంటున్నారని, నిన్న ఇవాళ వచ్చిన ప్రతిపాదన కాదన్నారు. సోమవారం సెక్రటేరియెట్​లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఆరు నూరైనా కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియెట్​ కట్టితీరుతామన్నారు. ఇప్పుడున్న సెక్రటేరియెట్, అసెంబ్లీ ఇరుకుగా ఉందని, ఈ విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ‘‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఎప్పుడు ప్రస్తావించని  మీ ముఖాలు మాకు సజేషన్​ చేయడమేంది? సెక్రటేరియెట్​ పరిశీలనకు పిక్నిక్​కు వచ్చినట్లు వచ్చిండ్రు, వెళ్లిపోయిండ్రు. మొత్తం చూడొచ్చు కదా? కండిషన్​ ఎలా ఉందో పరిశీలించొచ్చు కదా. ఆ పని చేయలె.  టీవీలకు, పేపర్లకు పోజులివ్వడానికే వచ్చిండ్రు” అని కాంగ్రెస్​ నేతలపై తలసాని మండిపడ్డారు. అసెంబ్లీ, సెక్రటేరియెట్​ కడితే కాంగ్రెస్ కు చెప్పి కట్టాలా అని ప్రశ్నించారు. అది ప్రభుత్వ ఆస్తి అని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీగా మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని, నిర్మాణాలను అడ్డుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని  స్పష్టం చేశారు.

మేము 40 వేల ఉద్యోగాలు ఇచ్చినం…

50 ఏండ్ల రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేయలేదని, వెయ్యి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తలసాని అన్నారు. తాము 40 వేల ఉద్యోగాలిచ్చామని, మిగతా ఉద్యోగాలు దశలవారీగా భర్తీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న భట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా వెళ్లలేదని పేర్కొన్నారు. గ్రామాలకు వెళితే గురుకులాలకు భవనాలు ఉన్నయా లేవా అనే విషయం తెలుస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్నామని తలసాని తెలిపారు.