- పెట్టుబడికి, పెంచిన ఎంఎస్‌పీకి సంబంధం లేదని విమర్శ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతుల ఆశలను నీరుగార్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు విమర్శించారు. రైతుల ఆదాయాన్ని పెంచే సంకల్పం కేంద్ర ప్రభుత్వంలో కనిపించడం లేదని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను బుట్టదాఖలు చేసిందని గురువారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. సంపూర్ణ ఉత్పత్తి వ్యయం (సీ2)పై కనీసం 50 శాతం లాభం కలిపి ఎంఎస్‌పీ నిర్ణయించాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం మరోసారి సిఫారసులను తుంగలో తొక్కిందని ఆరోపించారు.
వరికి గతంతో పోలిస్తే క్వింటాలుకు కేవలం రూ.72 మాత్రమే పెంచడం దారుణమని మండిపడ్డారు. ఎరువులు, కూలీల ఖర్చులు, విత్తనాలు, డీజిల్, విద్యుత్ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పెంపు కేంద్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. మొక్కజొన్న క్వింటాల్‌కు రూ.10 మాత్రమే పెంచడాన్ని తుమ్మల తీవ్రంగా ఖండించారు. రైతులకు పది రూపాయలు ఇచ్చి వందల రూపాయల ప్రచారం చేసుకోవడం కేంద్రానికి అలవాటైపోయిందని ఫైర్ అయ్యారు. పత్తికి మద్దతు ధర రూ.557 పెంచినా, ఈ పంట సాగులో భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయాలతో రైతులకు గిట్టుబాటు కాదన్నారు.
వేరుశెనగ ఎంఎస్‌పీ కేవలం 3.5 శాతం, సోయాబీన్ 7.1 శాతం పెంచడం ఆశించిన స్థాయిలో లేదన్నారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు కల్పించాలంటే కనీసం 30–40 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉందని తుమ్మల స్పష్టం చేశారు. మొక్కజొన్న, జొన్న పంటలను వెంటనే ధర మద్దతు పథకం (పీఎస్‌ఎస్) పరిధిలోకి తీసుకురావాలని మంత్రి కోరారు. మొక్కజొన్న, జొన్న కొనుగోళ్ల ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.4 వేల కోట్ల అదనపు భారం భరిస్తోందని వెల్లడించారు.
