- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం పౌర సరఫరాలు, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, పంటల కొనుగోలు, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు, ఖమ్మం నగర కార్పొరేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి రివ్యూ నిర్వహించారు.
జూన్ మొదటి వారానికి బైపాస్ నుంచి కేబుల్ బ్రిడ్జ్ వరకు మున్నేరు రిటైనింగ్ వాల్ ఎడమ, కుడి వైపుల పనులు పూర్తవ్వాలని, చిన్న గ్యాప్ కూడా ఉండకూడదని స్పష్టం చేశారు. ఖమ్మం నగరాన్ని స్పోర్ట్స్ హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం, క్రీడాకారుల వసతి గృహాలు, అతిథి గృహం, కన్వెన్షన్ హాల్ వంటి సదుపాయాలతో 20 ఎకరాల్లో 92 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
వెలుగుమట్ల అర్బన్ పార్క్‌లో రోడ్ డివైడర్ ఎక్కువ స్థలం ఆక్రమిస్తోందని మార్పులు చేయాలన్నారు. ధంసలాపురం ఎస్టీపీ స్థలాన్ని మూడు రోజుల్లో అప్పగించి, వర్షాకాలానికి ముందే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్‌లైన్ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఖమ్మం ఖిల్లాకు రోప్‌వే నిర్మాణంలో వర్షాల వల్ల పనులు ఆగకుండా ముందే పూర్తి చేయాలని, ఈ నెలలో బేస్మెంట్ పనులు పూర్తి చేయాలని సూచించారు.
మార్కెట్ అభివృద్ధి పనులు, పంటల కొనుగోళ్లు సమాంతరంగా జరగాలని, మార్కెట్ కాంపౌండ్ వాల్, మిగిలిన షెడ్లు పూర్తి చేయాలని చెప్పారు. పంటల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, 4 లక్షల 34 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉండగా 2.17 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
ఇప్పటివరకు 39 వేల టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. జిల్లాలో 72 వేల టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని తెలిపారు. 2,37,500 మెట్రిక్ టన్నుల వరి కొనుగోళ్లకు 308 కేంద్రాలు ప్రతిపాదించగా, 240 కేంద్రాలు ప్రారంభించామని తెలిపారు. 45 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. టీయూఎఫ్ఐడీసీ క్రింద 66 పనులు మంజూరు కాగా 63 పూర్తయ్యాయని, మిగిలిన 3 పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు.
అనంతరం మంత్రి తుమ్మల నగరంలోని చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జ్ ను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్టీవో ఆఫీస్వద్ద రూ. కోటీ 46 లక్షలతో ఆర్టీవో ఆఫీస్ నుంచి బైపాస్ రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు, విజయనగర కాలనీలో రూ.50.85 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

