హైదరాబాద్ సిటీ పరిధిలోని నీటి సరఫరా, లో ప్రెజర్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జలమండలి చర్యలు చేపట్టింది. సిటీలో మోటార్ ఫ్రీ ట్యాప్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అక్రమ మోటార్లపై జలమండలి విజిలెన్స్ అధికారుల దాడులు చేస్తున్నారు. పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. రెండో సారి పట్టుబడితే భారీగా జరిమానా విధిస్తామని జలమండలి అధికారులు హెచ్చరించారు.
గురువారం (ఏప్రిల్ 24) తెల్లవారు జామునుంచే సికింద్రాబాద్ లోని గాంధీ నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. పైపులైన్లకు అక్రమంగా బిగించిన 17 మోటార్లు స్వాధీనం చేసుకున్నారు. పైపు లైన్లకు మోటార్లు బిగించిన వారిపై కేసులు నమోదు చేశారు. అక్రమంగా మోటార్లు బిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పైపు లైన్లకు మోటార్లు బిగించవద్దని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి హెచ్చారించారు. వినియోగదారులు పైపులైన్లకు మోటార్లు బిగించి రెండో సారి పట్టబడితే రూ. 5వేల జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. లోప్రెజర్, నీటి సరఫరాపై ఏవైనా కంప్లయింట్స్ ఉంటే అధికారులను సంప్రదించాలని సూచించారు. కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని జలమండలి హామీ ఇచ్చారు.

