- టామ్‌కామ్‌తో ఉపాధి కల్పిస్తున్నాం
- భాష, ఏఐపై పట్టు సాధిస్తే తప్పక కొలువులు
- ‘భారత్ ఈయూ మొబిలిటీ’
- రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌కు హాజరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర యువతలో నైపుణ్యాలను పదునుపెట్టి గ్లోబల్ కొలువులు సాధించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు కల్పించే టామ్‌కామ్ సంస్థ బలోపేతానికి బడ్జెట్‌లో రూ.90 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. యూరప్ దేశాల్లో ప్రస్తుతం భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, విదేశీ కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా మన యువతను సన్నద్ధం చేయాలన్నారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో విదేశాంగ శాఖ, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘భారత్ ఈయూ మొబిలిటీ’రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. ‘‘మన దేశంలో నైపుణ్యవంతులైన మానవ వనరులకు ఏ మాత్రం కొదవలేదు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని యువతను గ్లోబల్ కెరీర్ వైపు నడిపిస్తాం. టామ్‌కామ్ ద్వారా నైపుణ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసి, యువతకు సురక్షితమైన ఉపాధి మార్గాలను చూపుతాం. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా శిక్షణ పొందిన ఎంతో మంది యువత విదేశాల్లో విజయవంతంగా
స్థిరపడ్డారు” అని తెలిపారు.
120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు..
జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతను సిద్ధం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 120 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ అత్యాధునిక కేంద్రాల ద్వారా మెరుగైన, పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా యూరప్ లాంటి దేశాల్లో ఉద్యోగాలు సాధించాలంటే జర్మన్ తదితర విదేశీ భాషలపై పట్టు సాధించడం ముఖ్యమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని యువతకు సూచించారు. తన ఇటీవలి జర్మనీ పర్యటనలో వైద్య, సాంకేతిక, తయారీ రంగాల్లో నైపుణ్యవంతులకు ఉన్న భారీ డిమాండ్‌ను తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్నందున సంప్రదాయ ఉద్యోగ విధానాలు పూర్తిగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆధునిక సాంకేతికతలో పోటీపడేలా శిక్షణ తీసుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరని తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, భాషా శిక్షణపై రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులను సైతం అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ అండర్ సెక్రటరీ ఆదర్శ్ కుమార్ మెహ్రా, ఎల్‌ఈటీఎఫ్ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి శిక్షణ విభాగం డైరెక్టర్ కాంతి వెస్లీ, రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి స్నేహాజ తదితరులు పాల్గొన్నారు.
అక్రమ మార్గాల్లో విదేశాలకు వెళ్లొద్దు..
విదేశాలకు పంపుతామని ఆశచూపి నిరుద్యోగులను నిలువునా ముంచుతున్న నకిలీ ఏజెంట్లు, అక్రమ వలసల సమస్యపై మంత్రి వివేక్ మండిపడ్డారు. ఎయిర్‌పోర్టులకు వెళ్లాక తాము మోసపోయామని గ్రహించి యువత ఇబ్బందులు పడుతున్న ఘటనలు తన దృష్టికి వచ్చాయని, ఇలాంటి అక్రమాలకు ఇకపై శాశ్వతంగా చెక్ పెట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు వెళ్తే కలిగే ప్రమాదాలపై ప్రభుత్వం యువతలో అవగాహన కల్పిస్తోందని, సురక్షిత, చట్టబద్ధమైన మార్గాల ద్వారా మాత్రమే వెళ్లాలని సూచించారు. ఉద్యోగాలు ఆశించే యువతకు, విదేశీ సంస్థలకు మధ్య నమ్మకమైన వారధిగా టామ్‌కామ్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విదేశాలకు వెళ్లాలంటే కేవలం టామ్‌కామ్ ద్వారానే వెళ్లాలి.. అనేలా రాబోయే రోజుల్లో ఈ సంస్థపై ప్రజల్లో
నూరు శాతం విశ్వాసం కల్పిస్తామని తేల్చిచెప్పారు.
