- రెండు లక్షల కొత్త పింఛన్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది: మంత్రి వివేక్ వెంకటస్వామి
- బీఆర్‌ఎస్ అధికారంలో ఉండగా కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలే
- అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం
- పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నం
- మిర్యాలగూడ, నకిరేకల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తం
- కాంగ్రెస్ సీనియర్ నేత కోడిరెక్క శౌరి అంత్యక్రియలకు హాజరు
మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను ఇవ్వనున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కొత్త పెన్షన్లకు ఆమోదముద్ర వేసిందని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేత కోడిరెక్క శౌరి అనారోగ్యంతో ఆదివారం చనిపోగా, ఆయన అంత్యక్రియల్లో వివేక్ పాల్గొన్నారు. అనంతరం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో మంత్రి వివేక్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో కొత్తగా ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు పారదర్శకంగా జరుగుతున్నాయని, సకాలంలో రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. అలాగే, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఆధునిక టెక్నాలజీలో నైపుణ్యం కల్పించేందుకు మిర్యాలగూడ, నకిరేకల్‌లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని, త్వరలోనే వీటి పనులు ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్రంలో నిరుద్యోగులకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. టామ్‌కామ్ సంస్థ ద్వారా యువతకు విదేశీ భాషలు నేర్పించడంతో పాటు నైపుణ్య శిwక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. జర్మనీలో సుమారు 5 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని, టామ్‌కామ్ ద్వారా జర్మనీ భాష నేర్పించేందుకు ప్రత్యేకంగా ఫ్యాకల్టీని నియమిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఈ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి రూ.90 కోట్లు కేటాయించారని తెలిపారు. పరిశ్రమల్లో కార్మికుల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ఫ్యాక్టరీలలో రక్షణ ఏర్పాట్లను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఫార్మా రంగంలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు, కార్మికుల ప్రాణ రక్షణకు త్వరలో నూతన విధివిధానాలను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విప్ వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేత శవపేటికను మోసిన మంత్రి వివేక్..
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడిరెక్క శౌరి అంత్యక్రియల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొని, శవపేటికను మోశారు. అంతిమ సంస్కారాల తర్వాత శౌరి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని ఓదార్చారు. పార్టీ కోసం శౌరి అహర్నిశలు పనిచేశారంటూ ఆయన సేవలను మంత్రి గుర్తుచేసుకున్నారు.
