గనుల శాఖలో అక్రమాలకు చెక్ పెట్టినం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గనుల శాఖలో అక్రమాలకు  చెక్ పెట్టినం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • కొత్త క్రషర్ పాలసీతో ఆదాయం పెరిగింది: వివేక్ వెంకటస్వామి
  • ఇల్లీగల్ మైనింగ్, క్రషర్స్​పై కఠిన చర్యలు
  • సిరిసిల్ల ఇసుక మాఫియాను మర్చిపోతే ఎలా?
  • హరీశ్​ రావు.. ఒక కంపెనీ కోసం 
  • హౌస్ కమిటీ వేయాలనడం కరెక్ట్​ కాదు
  • వారి హయాంలో హౌస్ ​కమిటీలు ఎందుకు వేయలేదు?  
  •  పదేండ్ల ఇల్లీగల్ దందాలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: గనుల శాఖలో గత పదేండ్లుగా సాగిన దోపిడీకి చెక్ పెట్టి, ఆదాయం పెరిగేలా శాఖను గాడిన పెట్టామని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఇందుకోసం కొత్త క్రషర్ పాలసీనీ తీసుకొచ్చామని వెల్లడించారు. శనివారం అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుడు హరీశ్​రావు.. రాఘవ కన్‎స్ట్రక్షన్స్ పై చేసిన ఆరోపణలకు మంత్రి వివేక్​దీటుగా బదులిచ్చారు. రాఘవ కన్‎స్ట్రక్షన్స్ పై ఇప్పటికే రంగారెడ్డి కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశామన్నారు. అక్రమాలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామని చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని మంత్రి హెచ్చరించారు. పర్మిషన్ లేకుంటే పొల్యూషన్ బోర్డు వాళ్లు సైతం చర్యలు తీసుకుంటారని గుర్తుచేశారు. ఎలక్ట్రిక్​ మీటర్లు లేని చోట డీజిల్​కు పర్మిషన్ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. నేరెళ్లలో దళితులపై దాడులు చేసిన చరిత్ర బీఆర్ఎస్​ దని, తమ హయాంలో అక్రమాలకు తావులేదని తేల్చి చెప్పారు. గత పదేండ్లలో జరిగిన ఇల్లీగల్ ఇసుక దందా, మైనింగ్ అక్రమాలపైనా విచారణ చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్​వెంకటస్వామి స్పష్టం చేశారు. 

కొత్త క్రషర్ ​విధానంతో మంచి ఫలితాలు.. 

నవంబర్ 2025లో ప్రవేశపెట్టిన కొత్త క్రషర్ విధానం మంచి ఫలితాలిస్తోందని మంత్రి వివేక్ పేర్కొన్నారు. ఈ విధానం అమల్లోకి వచ్చిన నాలుగు నెలల్లోనే పర్మిట్ ఫీజు, సీనరేజ్ రూపంలో రికార్డు స్థాయి వృద్ధి నమోదైందన్నారు. గతేడాది నవంబర్లో 63% పర్మిట్ ఫీజు రెవెన్యూ పెరగ్గా, సీనరేజ్ ఫీజు గ్రోత్ 79శాతం ఉందన్నారు. డిసెంబర్ లో 60% పర్మిట్ ఫీజు, 81% సీనరేజ్ ఫ్రీ గ్రోత్ ఉందని, ఈ ఏడాది జనవరిలో పర్మిట్ ఫ్రీ 73%.. సీనరేజ్ 96 శాతం పెరిగిందన్నారు. ఫిబ్రవరి నెలలో పర్మిట్ ఫీజు 83 శాతం.. సీనరేజ్ ఫీజు 97శాతం గ్రోత్ ఉందని వెల్లడించారు. అక్రమ మైనింగ్‌‌‌‌‌‌‌‌ను నియంత్రించడానికి ప్రభుత్వం టెక్నాలజీని వాడుతోందని మంత్రి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా విద్యుత్ వినియోగం ఆధారంగా ఫీజు వసూలు చేసే పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు పెనాల్టీల రూపంలోనే రూ.7.87 కోట్లు వసూలు చేశామన్నారు. ఇసుక ఆదాయం గతేడాది రూ.700 కోట్లు ఉంటే.. ఈ ఏడాది రూ. వెయ్యి కోట్లకు చేరిందని వివరించారు.

అప్పుడెందుకు హౌస్​ కమిటీ వేయలే? 

గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల అవకతవకలు జరిగినా నోరు మెదపని నేతలు, ఇప్పుడు చిన్న విషయాలకే హౌస్ కమిటీ అడగడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. 2022లో అప్పటి మంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ దాడులు జరిగితే హౌస్ కమిటీ వేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదో చెప్పాలన్నారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక అక్రమాలపై అప్పుడు ఎందుకు హౌస్ కమిటీ వేయలేదని ప్రశ్నించారు. సిరిసిల్లలో, మహబూబ్ నగర్​ లో దళితులను కొట్టినప్పుడు హౌస్​ కమిటీ వేయడం మరిచిపోయారా? అంటూ నిలదీశారు. హరీశ్​ రావు.. ఒక కంపెనీ కోసం హౌస్​ కమిటీ వేయాలని కోరడం సరికాదన్నారు. మంత్రికి సంబంధం లేని అంశంపై హౌస్ కమిటీ వేయాల్సినంత అవసరం లేదన్నారు. అవకతవకలకు పాల్పడిన వారు ఎవరైనా సరే.. కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాఘవ కన్‎స్ట్రక్షన్స్ సంస్థ.. పర్మిట్ ఫీజు కింద రూ.1.22 కోట్లు, సినరేజ్ ఫీజు కింద మరో రూ.1.52 కోట్లు చెల్లించిందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు.  కేవలం రూ.4 లక్షల సీనరేజ్ ఫీజు చెల్లించలేదని హౌస్ కమిటీ అడగడం సరికాదన్నారు.