రైతుల నిరసన​లో దారుణం

రైతుల నిరసన​లో దారుణం
  • యూపీలో ఆందోళనకారులపైకి
  • దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్​
  • తీవ్ర గాయాలతో నలుగురు రైతులు మృతి
  • రెండు కార్లకు నిప్పు పెట్టిన రైతులు.. 
  • దాడిలో నలుగురు బీజేపీ కార్యకర్తలు మృతి  

లఖీంపూర్ ఖేరి (యూపీ):  కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త అగ్రిచట్టాలను రద్దు చేయాలంటూ ఆదివారం యూపీలో రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరి జిల్లా టికోనియా - – బన్బీర్ పూర్ రోడ్డుపై నల్లజెండాలతో రైతులు నిరసన తెలుపుతుండగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కాన్వాయ్ వారిని ఢీకొట్టింది. నలుగురు రైతులు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన రైతులు రెండు కార్లలోని ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, ఒక డ్రైవర్​ను కొట్టి చంపారు. ప్రమాదంలో 8 మంది రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో తేజీందర్ ఎస్ విరాక్ అనే రైతు సంఘం నాయకుడు కూడా ఉన్నారు. 

కఠిన చర్యలు తీస్కుంటం: యూపీ సీఎం యోగి 
లఖీంపూర్ ఖేరిలో హింసపై యూపీ సీఎం యోగి సీరియస్ అయ్యారు. నిరసనల్లో హింస చోటుచేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు జరిపిస్తామని, హింసకు కారణమైన వాళ్లను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 


సంఘటన జరిగిన వెంటనే రోడ్డు పక్కన రెండు వెహికల్స్ మంటల్లో కాలుతుండటం, తీవ్ర గాయాలై ఒక వ్యక్తి రోడ్డుపై పడి ఉండటం, రోడ్డు పక్కన పడిపోయి ఉన్న ఓ వ్యక్తిని కొందరు కర్రలతో కొడుతుండటం వంటి దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి. అయితే, కేంద్ర మంత్రి మిశ్రా కొడుకే స్వయంగా కారుతో రైతులను ఢీకొట్టించాడని, రైతులపై కాల్పులు కూడా జరిపాడంటూ రైతు సంఘాలు ఆరోపించాయి. అసలు తాను గానీ, తన కొడుకు గానీ స్పాట్ లో లేనేలేమని, తమ కార్లపై రైతుల ముసుగులో కొందరు దాడి చేశారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 
అసలేం జరిగిందంటే..
లఖీంపూర్ జిల్లాలోని బన్బీర్ పూర్ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా సొంత గ్రామం. ఆదివారం తన గ్రామంలో జరిగే ఓ కార్యక్రమంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యతో కలిసి ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, కొద్దిమంది రైతులు మాత్రమే అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారని, ఐదు పది నిమిషాల్లో వాళ్లను సైలెంట్ చేయొచ్చంటూ ఇటీవల రైతుల నిరసనలను తక్కువ చేసి చూపుతూ మిశ్రా కామెంట్లు చేశారు. దీంతో మంత్రి గ్రామంలో జరిగే కార్యక్రమం సందర్భంగా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు రైతులు ఉదయం నుంచే సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రోడ్డుకు ఇరువైపులా నల్లజెండాలతో నిరసనలు తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రికి చెందిన రెండు కార్లు ఢీకొని నలుగురు రైతులు చనిపోయారని, దీంతో కార్లలోని నలుగురిని బయటకు లాగి రైతులు కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. రెండు కార్లను తగులబెట్టారని వెల్లడించారు. అయితే రైతుల దాడి వల్లే ఓ కారు బోల్తా పడినట్లు చెప్పారు. హింసాత్మక ఘటన వల్ల డిప్యూటీ సీఎం మౌర్య తన పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిపారు. 
రైతుల ముసుగులో కుట్ర చేసిన్రు: అజయ్ మిశ్రా 
అసలు సంఘటన జరిగిన ప్రాంతంలో తాను గానీ, తన కొడుకు గానీ లేమని కేంద్ర మంత్రి మిశ్రా స్పష్టం చేశారు. ఆ టైమ్​లో తన కొడుకు గ్రామంలో మీటింగ్ జరిగే ప్రాంతంలో ఉన్నాడని, అందుకు వేలాది మంది జనం, పోలీసులే సాక్ష్యమన్నారు. తాను కూడా డిప్యూటీ సీఎం వెంటే ఉన్నానన్నారు. డిప్యూటీ సీఎంను రిసీవ్ చేసుకునేందుకు ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఓ డ్రైవర్ కార్లలో వస్తుండగా, రైతుల ముసుగులో కొందరు రాళ్లతో దాడి చేశారని, దీంతో వెహికల్ అదుపు తప్పి రైతులను ఢీకొట్టిందన్నారు. తనకు వ్యతిరేకంగా పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు. స్పాట్ లో తన కొడుకు ఉన్నా కొట్టి చంపేవారన్నారు. 
నేడు సంఘటనా స్థలానికి నేతలు 
లఖీంపూర్ ఖేరిలో హింస జరిగిన ప్రాంతానికి సోమవారం పలువురు నేతలు రానున్నారు. బీకేయూ నేత రాకేశ్ తికాయత్, పంజాబ్, హర్యానా నుంచి ఇతర రైతు సంఘాల నేతలు ఆదివారమే బయలుదేరారు. యూపీ మాజీ సీఎం అఖిలేశ్, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా సోమవారం రానున్నారు.   
రైతుల బలిదానం వృథా కానివ్వం: రాహుల్​
రైతుల బలిదానం వృధా పోనివ్వబోమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని మాజీ సీఎం, సమాజ్ వాదీ చీఫ్​ అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. హింసకు బీజేపీ కార్యకర్తలే కారణమన్నారు. రైతులను కారుతో తొక్కించేలా కేంద్ర మంత్రే కుట్ర పన్నారని ఆర్ఎల్డీ చీఫ్​జయంత్ చౌధరీ ట్వీట్ చేశారు. ‘‘నిరసన తర్వాత రైతులు తిరిగి వస్తుండగా దాడి జరిగింది. కొందరిని కారుతో తొక్కించారు. మరికొందరిపై కాల్పులు  జరిపారు” అని రాకేశ్ తికాయత్ ట్వీట్ చేశారు.  ఈ ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జిల్లాల కలెక్టరేట్ల ముందు సోమవారం మధ్యాహ్నం ధర్నాలు చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.